
నిజామాబాద్, వెలుగు:నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి రేకులపల్లి లక్ష్మి నర్సమ్మ (94)కు సీఎం రేవంత్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. వృద్ధాప్య సమస్యలతో గత నెల 29న ఆమె మరణించారు. శుక్రవారం నిజామాబాద్‌లోని బోర్గాం(పి)లో నిర్వహించిన లక్ష్మినర్సమ్మ దశదిన కర్మకు సీఎం హాజరయ్యారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బోర్గాం(పి) వెళ్లారు. అనంతరం లక్ష్మినర్సమ్మ చిత్రపటానికి నివాళి అర్పించి, భూపతిరెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, తాహెర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం హైదరాబాద్‌కు బయలుదేరారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జిల్లా సమస్యలపై వినతి పత్రం అందజేశారు.