రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు: సీఎం రేవంత్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు: సీఎం రేవంత్
  • ఇప్పుడిప్పుడే గాడిన పెడ్తున్నం.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటది
  • కపటనాటక సూత్రధారి కేసీఆర్​ మళ్లీ బయల్దేరిండు 
  • పదేండ్లలో ఏ నాడైనా ఉద్యోగులకు ఫస్ట్​ తారీఖు జీతాలిచ్చిండా? 
  • ఆర్టీసీ కార్మికుల ధర్నాలను అణచివేసిండు.. 50 మంది కార్మికులను బలి తీసుకున్నడు 
  • రూ. 8.29 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా? 
  • లక్షా రెండు వేల కోట్లతో కాళేశ్వరం కడితే.. అది కూలేశ్వరం అయింది
  • సింగరేణి సహా కాంట్రాక్టర్ల వరకు అందరికీ బాకీలు పెట్టిండు
  • ప్రతి నెలా కనీస అవసరాలకే రూ. 22,500 కోట్లు కావాలి
  • వస్తున్న ఆదాయం 18,500 కోట్లు.. అందులో  అప్పుల చెల్లింపులకే 6,500 కోట్లు ఖర్చు
  • ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి.. మీకు అండగా ఉంట 
  • త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకువస్తామని వెల్లడి
  • మే డే కార్యక్రమంలో ప్రసంగం

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. గత సర్కార్​ చేసిన అప్పులకు, తప్పులకు కుప్పకూలిందని.. ఇప్పుడిప్పుడే గడిన పెడ్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మరో ఏడాదిలో ఆర్థిక పరిస్థితి కొంత కుదురుకుంటుందని, అప్పటివరకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, తమను నమ్మి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

గత ప్రభుత్వం  రూ. 8.29 లక్షల కోట్ల  అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టిందని, అయినా తమ ప్రజా ప్రభుత్వం ప్రతి రూపాయిని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నదని సీఎం తెలిపారు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజల సహకారం కావాలన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే గిగ్ వర్కర్స్ పాలసీ త్వరలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

గురువారం మే డే సందర్భంగా హైదరాబాద్‌‌‌‌లోని రవీంద్రభారతిలో కార్మిక శాఖ నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. “మీరు(ఆర్టీసీ కార్మికులు) తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. మీ కష్టం, శ్రమ, కృషి వల్లే ఈ ప్రభుత్వం ఏర్పడింది. సమ్మె చేస్తే రాష్ట్రానికి నష్టం. నన్ను నమ్మండి, నమ్ముకున్నవారికి అండగా ఉంట. సమస్యలు ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌తో చర్చించండి. నేనూ మీతో కూర్చుంటాను. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ఆయన అన్నారు. 

అప్పుల చెల్లింపులకే ప్రతి నెలా 6వేల 500 కోట్లు

ఆర్టీసీ కార్మికులతోపాటు అన్నివర్గాల కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సభ్యులుగా భావిస్తున్నదని సీఎం రేవంత్​ తెలిపారు. “మీరు మా కుటుంబ సభ్యులు. మీ సంక్షేమం, అభివృద్ధి, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ సోదరుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న. రాష్ట్ర ఆదాయాన్ని మీ ముందు పారదర్శకంగా ఉంచుతా. అబద్ధాలతో పరిపాలన నడువదు. ఎవరు నొచ్చుకున్నా.. ఉన్నది ఉన్నట్టు చెప్త. వచ్చే ఆదాయం ఏమిటో మీ ముందు ఉంచుత. ఎట్లా ఖర్చు చేయాలో మీరూ చెప్పండి” అని సూచించారు. అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూల్చిందని సీఎం మండిపడ్డారు.  

“1948 నుంచి 2014 వరకు 16 మంది ముఖ్యమంత్రులు 72 వేల కోట్ల అప్పు చేస్తే.. ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ. 8.29 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ అప్పులతో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా రెండు వేల కోట్లు ఖర్చు చేసి, మూడేం డ్లలోనే కుప్పకూలేలా చేశారు. దాన్ని కూలేశ్వరంగా మార్చారు. ఇలాంటి ఆర్థిక నేరాలు దేశంలో ఎక్కడా జరగలేదు. సింగరేణికి 20 వేల కోట్లు, విద్యుత్ శాఖకు 25-వేల కోట్ల నుంచి 30 వేల కోట్లు, కాంట్రాక్టర్లకు 50 వేల కోట్ల బకాయిలు పెట్టిపోయారు” అని ఆయన అన్నారు. 

ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుండగా, రూ.22,500 కోట్లు కనీస అవసరాలకు కావాలని తెలిపారు. గత సర్కార్​ చేసిన అప్పులకు చెల్లింపుల కోసమే ప్రతి నెలా రూ. 6,500 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నదని, రూ.6,000 కోట్లు జీతాలు, పెన్షన్లకు ఖర్చవుతున్నాయని సీఎం వివరించారు.

50 మంది ఆర్టీసీ కార్మికులను బలి తీసుకున్నడు

ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని.. 15 నెలల్లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేపట్టామని వివరించారు. “మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ, రూ. 500కే గ్యాస్​ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలవుతున్నాయి. 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టినం. శాంతి భద్రతల పరిరక్షణలో, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో తెలంగాణ నంబర్ వన్​గా నిలిచింది” అని ఆయన తెలిపారు. గిగ్ వర్కర్స్ కోసం దేశంలోనే మొదటి పాలసీని తాము తీసుకురాబోతున్నామని వెల్లడించారు.  

‘‘కేసీఆర్​కుటుంబానికి టీవీలు, పత్రికలు, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు, వేల కోట్ల వ్యాపారాలు వచ్చాయి. కానీ, పేదలు మరింత పేదలయ్యారు. ఆర్టీసీ కార్మికుల ధర్నాలను అణచివేసి, 50 మంది కార్మికులను బలితీసుకున్నారు. ధర్నా చౌక్‌‌‌‌ను మూసేశారు. మా ప్రజా ప్రభుత్వం వచ్చాక ధర్నా చౌక్ తెరిచాం, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం” అని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రజల సహకారం కావాలని, కొన్నిరోజులు ఓపిక పట్టాలని కోరారు. “మీరే మా పెద్దలు, మీకే చెప్పుకుంటాం. అబద్ధాలతో రాజకీయం చేయను. ఉన్నది ఉన్నట్లు చెబుతా. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా మీ ముందు ఉంచుతా. రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరు” అని ఆయన అన్నారు.

కేసీఆర్​కు కడుపు నిండా విషం

పదేండ్లు పరిపాలించిన కేసీఆర్​ కడుపు నిండా విషం నింపుకొని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ ​రెడ్డి మండిపడ్డారు. అధికారం పోయిందన్న బాధతో ఆయనకు దుఃఖం వస్తున్నదని, మొన్న వరంగల్​ సభలో తప్పుడు మాటలతో ప్రజలను రెచ్చగొట్టా లని చూశారని అన్నారు. కపట నాటక సూత్రధారి కేసీఆర్​ అని, విషపు చూపులతో మోసం చేయాలని చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

‘‘తెలంగాణను గొప్పగా పరిపాలించినమని చెప్పుకునే కేసీఆర్​.. పదేండ్లలో ఎన్నడైనా మొదటి తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండా? మీ(కార్మికులను ఉద్దేశిస్తూ) సోదరుడు సీఎం అయిన తర్వాత ప్రతి నెలా టైమ్​కు జీతాలు పడుతున్నయ్.  ఆనాటికీ ఈనాటికీ తేడా గమనించండి” అని ఆయన అన్నారు.