కేసీఆర్.. నీ పార్టీకి నీ కొడుకే గుదిబండ.. ఆయన ఉన్నంతకాలం జనం బండకేసి కొడుతూనే ఉంటరు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్.. నీ పార్టీకి నీ కొడుకే గుదిబండ.. ఆయన ఉన్నంతకాలం జనం బండకేసి కొడుతూనే ఉంటరు: సీఎం రేవంత్ రెడ్డి
  • BRS ​ను  ముంచేది కేటీఆరే.. 
  • తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకున్నది
  • 8 లక్షల కోట్ల అప్పు చేసినా వాళ్ల ఆశ తీరలేదు 
  • నాడు మంత్రులతోనూ మాట్లాడని కేసీఆర్.. 
  • ఇప్పుడు సర్పంచ్‌‌లతో సైతం మాట్లాడుతున్నడు 
  • ఎస్‌‌ఎల్‌‌బీసీని పదేండ్లు పడావు పెట్టారు.. అక్కడ ప్రమాదం జరిగితే మామాఅల్లుళ్లు డ్యాన్స్‌‌ చేశారు 
  • ఎవరు అడ్డం పడ్డా ఎస్‌‌ఎల్‌‌బీసీ, 
  • డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడి 
  • నల్గొండ జిల్లా దేవరకొండ సభలో సీఎం ప్రసంగం

నల్గొండ, వెలుగు: 
బీఆర్ఎస్‌‌ను ముంచేది కేటీఆరే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్.. బీఆర్‌‌ఎస్‌‌కు కేటీఆరే పెద్ద గుదిబండ. ఆయన ఉన్నంతకాలం మీ పార్టీని జనం బండకేసి కొడుతూనే ఉంటారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ను ఎవరో ముంచాల్సిన అవసరం లేదు. నీ కొడుకే నీ పార్టీని ముంచేస్తడు” అని వ్యాఖ్యానించారు. ‘‘మొన్నటి జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికలు రెఫరెండం అంటూ కేటీఆర్​వస్తే.. బీఆర్‌‌ఎస్‌‌ను అక్కడి పబ్లిక్​ బండకేసి కొట్టిన్రు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి’’  అని ప్రజలకు పిలుపునిచ్చారు. 

గతంలో మంత్రులను కూడా ప్రగతిభవన్‌‌కు రానివ్వని కేసీఆర్.. ఇప్పుడు సర్పంచ్‌‌లను ఫామ్‌‌హౌస్‌‌కు పిలిపించుకుంటున్నారని విమర్శించారు. ఇద్దరు స‌‌ర్పంచ్‌‌లు, న‌‌లుగురు వార్డు మెంబ‌‌ర్లను కూర్చోబెట్టుకుని ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ‘‘కేసీఆర్​కుటుంబం పదేండ్ల పాటు తెలంగాణను దోచుకుంది. తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ.. తెలంగాణను నలువైపులా నుంచి పీక్కుతిన్నరు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసినా కేసీఆర్​ఆశ తీరడం లేదా?’’ అని ఫైర్​అయ్యారు. 

అసెంబ్లీ ఎన్నిక‌‌ల్లో ఓడి అధికారం పోయినా, పార్లమెంట్​ఎన్నికల్లో గుండు సున్నా వ‌‌చ్చినా, ఎమ్మెల్సీ ఎన్నిక‌‌ల్లో అభ్యర్థులే దొరకకున్నా.. బీఆర్ఎస్ నేతలకు మాత్రం బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. శనివారం నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రంలో పేదలు, రైతులు, మహిళలు సంతోషంగా ఉన్నారని.. మహిళలకు ఫ్రీ బస్సు, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. 

రెండేండ్ల కింద గడీల పాలనను కుప్పకూల్చినందుకే విజయోత్సవ సభలను నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ‘‘బీఆర్‌‌ఎస్‌‌ పదేండ్ల పాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది. ఆ పార్టీ నేతలు నాలుగున్నర కోట్ల మంది ప్రజలను దోచుకుతిన్నారు. కానీ మేం రెండేండ్ల ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలాగా చూసుకుంటున్నాం. 

గత ప్రభుత్వ హయాంలో చెప్పులరిగేలా తిరిగినా ఒక్క రేషన్‌‌ కార్డు కూడా ఇవ్వలేదు. మా పాలనలో అడిగిన ప్రతి ఒక్కరికీ కార్డు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యధిక రేషన్‌‌ కార్డులు దేవరకొండలోనే ఉన్నాయి. కొత్త రేషన్‌‌ కార్డుల జారీతో పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా చేశాం. 3 కోట్ల మంది సన్న బియ్యం తింటున్నారు. తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనైనా సన్నబియ్యం ఇస్తున్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం ఇవ్వడం లేదు. మరో పదేండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు. 

ఎంత మందికి ఇండ్లు ఇచ్చిన్రు? 

బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో ఎంత మందికి డబుల్‌‌ బెడ్‌‌రూం ఇండ్లు ఇచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌‌ విసిరారు. ‘‘రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాం. ఇందుకోసం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. చెంచులు, గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో అదనంగా 25 వేల ఇండ్లు మంజూరు చేశాం. కానీ గిరిజనుల మధ్య పంచాయితీ పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. లంబాడాలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్​పార్టీ. వాళ్లను ఎస్టీల్లో చేర్పించేందుకు జైపాల్‌‌రెడ్డి ఎంతో కృషి చేశారు. కేసీఆర్ పదెకరాల్లో గడీ కట్టుకున్నారు కానీ.. పేదలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లయినా ఇచ్చారా?” అని ప్రశ్నించారు. 

తాము 200 యూనిట్ల ఉచిత కరెంట్‌‌ ఇవ్వడంతో పేదల ఇండ్లలో వెలుగులు నిండాయన్నారు. ‘‘రూ.ల‌‌క్ష రుణ‌‌మాఫీ చేస్తామ‌‌న్న కేసీఆర్ .. రైతు నెత్తి మీద అప్పు పెట్టి ఫామ్‌‌హౌస్‌‌కు పరిమితమయ్యారు. మేం​అధికారంలోకి రాగానే 25 ల‌‌క్షల 35 వేల రైతు కుటుంబాల‌‌కు రూ.20 వేల కోట్ల రుణ‌‌మాఫీ చేశాం. వ్యవసాయం అంటే దండుగ‌‌ కాదు.. పండుగ అని నిరూపించాం. కాంగ్రెస్​అధికారంలోకి వస్తే కరెంట్​రాదని కేసీఆర్​అన్నారు. కానీ కేసీఆర్​ఇంట్లో కరెంట్‌‌నే ప్రజలు పీకేశారు. రైతులకు మాత్రం 24 గంటల కరెంట్​అందుతోంది” అని పేర్కొన్నారు. తాము ప్రజలకు ఇంత మంచి చేస్తుండగా.. త్వరలో ‘మంచి రోజులు వస్తాయి’ అంటున్న కేసీఆర్‌‌ను చూస్తే జాలేస్తోందన్నారు. 

డిండి, ఎస్‌‌ఎల్‌‌బీసీని పూర్తి చేస్తం.. 

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌‌ సమస్యను తీర్చాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఎస్‌‌ఎల్‌‌బీసీని కేసీఆర్‌‌ పడావు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 3.40 లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు ప్రజలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం తిరిగి పనులను ప్రారంభించిందని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి 8 మంది చనిపోతే.. మామాఅల్లుళ్లు (కేసీఆర్, హరీశ్) డ్యాన్స్‌‌ చేశారని మండిపడ్డారు. ఎవరు అడ్డం పడ్డా.. ఎస్‌‌ఎల్‌‌బీసీ, డిండిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 
రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌‌వన్‌‌గా నిలబెడుతామని, తెలంగాణ మోడల్‌‌ను ప్రపంచానికి చాటుతామన్నారు. నీళ్లు పారించినట్టు నిధులు పారించి దేవరకొండను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ‘‘ఎమ్మెల్యే బాలునాయక్‌‌ అడిగిన విధంగా దేవరకొండలో విద్యాభివృద్ధికి రూ.6 కోట్లు, వేంకటేశ్వరస్వామి ఆలయానికి నిధులు మంజూరు చేస్తాం. దేవరకొండకు నర్సింగ్‌‌ కాలేజీ మంజూరు చేస్తాం. దేవరకొండ నుంచి హైదరాబాద్‌‌ వరకు నాలుగు లేన్ల రహదారి మంజూరుకు కృషి చేస్తాం. మద్దిమడుగులో సేవాలాల్‌‌ మహారాజ్‌‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం” అని హామీ ఇచ్చారు. 

మద్యానికో, మాటలు చెప్పేవారికో ఓట్లు వేయొద్దు 

వడ్ల ఉత్పత్తిలో తెలంగాణ‌‌ను దేశంలోనే నెంబ‌‌ర్ వన్​చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గంజాయిని నిర్మూలించి దేశంలోనే తెలంగాణ‌‌ను దేశంలో నెంబర్ ​వన్ ​చేశామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్య, వైద్యంలోనూ తెలంగాణ‌‌ను నెంబర్​ వన్​ చేస్తామన్నారు. ‘‘ఫ్యూచర్​సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌‌ల్ స‌‌మిట్ ఏర్పాటు చేస్తున్నాం. దేశ‌‌, విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. తెలంగాణ మోడల్‌‌ను ఆవిష్కరించడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌‌గా నిలుపుతాం” అని చెప్పారు. 

పంచాయతీ ఎన్నికల్లో మద్యానికో, మాటలు చెప్పే వారికో ఓట్లు వేయొద్దని.. పనిచేసే వారినే ఎన్నుకోవాలని సూచించారు. అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, పేదలకు పథకాలు అందుతాయని అన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందిస్తామన్నారు. సభలో మండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌‌రెడ్డి, మందుల సామేలు, వంశీకృష్ణ, మధుసూదన్‌‌ రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్‌‌ గుత్తా అమిత్‌‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్‌‌నేత పాల్గొన్నారు.