నన్నే తాళ్లతో కట్టేశారు.. బీఆర్ఎస్‎పై సీఎం రేవంత్ ఫైర్

నన్నే తాళ్లతో కట్టేశారు.. బీఆర్ఎస్‎పై సీఎం రేవంత్ ఫైర్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలైనా కలుపుకుని ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్‎లను వాళ్ల సమస్యలపై మాట్లాడటానికి అవకాశం ఇచ్చామని.. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను ఎప్పుడైనా మాట్లాడనిచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెక్రటేరియట్‎కు వెళ్తానంటే ఎంపీనైనా నన్నే తాళ్లతో కొట్టేశారని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని.. ఎన్నికలయ్యాక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 

ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రజా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని చెప్పారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం (డిసెంబర్ 4) సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా‎లో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 

ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తున్నామని.. ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ  పీసీసీ అధ్యక్షుడిగా తన తొలి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే జరిగిందని.. తొలి బహిరంగ సభ ఇంద్రవెళ్లిలోనే జరిగిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇంద్రవెళ్లి అమరవీరుల స్మారక స్థూపాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దామని.. అలాగే ఇంద్రవెళ్లి అమరవీరులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకున్నామని చెప్పారు. సవాల్‎తోనే రాష్ట్రంలో వెనకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని.. త్వరలోనే మరోసారి ఆదిలాబాద్ కు వచ్చి జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేస్తానని తెలిపారు.