తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రండి..గవర్నర్కు ఆహ్వానం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రండి..గవర్నర్కు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌  సీపీ రాధాకృష్ణను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి  రాజ్ భవన్ కు వెళ్లిన రేవంత్ సీపీ రాధాకృష్ణతో  భేటీ అయ్యారు. రాష్ట్ర  ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానించారు.  

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేయనుంది. గత పదేండ్లలో లేని విధంగా అందరినీ కలుపుకుని, రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్​ నిర్ణయించింది. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను వేడుకలకు ఆహ్వానిస్తుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన లేఖ రాశారు   సీఎం రేవంత్  

ఈ  సారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలు నిర్వహించనుంది ప్రభుత్వం.   జూన్ 2న ఉదయం ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్​ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు సీఎం రేవంత్​ నివాళులు అర్పిస్తారు. 10 గంటలకు పరేడ్ గ్రౌండ్​లో పోలీసుల కవాతు ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి, సోనియా గాంధీ మాట్లాడతారు.

సాయంత్రం ట్యాంక్ బండ్​పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మొదలవుతాయి. రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై  ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్​కు సీఎం రేవంత్​రెడ్డి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. దాదాపు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.