హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఎట్ హోమ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ దంపతులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎస్, డీజీపీతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, వేం నరేందర్ రెడ్డి, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు హైకోర్టు జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొని తేనీటి విందు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు గైర్హాజరయ్యారు.
గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కలిసి పలు అంశాలపై అప్యాయంగా మాట్లాడుకోవడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుక ముగిసిన అనంతరం గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
