నీళ్లు, కరెంట్ ప్రాబ్లమ్​రావొద్దు.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

నీళ్లు, కరెంట్ ప్రాబ్లమ్​రావొద్దు.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
  • ప్రజా సమస్యల పరిష్కారమే మాకు టాప్​ ప్రయారిటీ
  • పెరిగిన డిమాండ్​కు తగ్గట్టుగా కరెంట్ ఇవ్వాలి
  • ఎక్కడైనా ప్రాబ్లమ్​ వస్తే వెంటనే పరిష్కరించాలి
  • ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల్లోపు చేరవేయాలి
  • గ్రామాలవారీగా ప్రత్యేక డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్
  • తాగునీటి సమస్య పరిష్కారానికి జిల్లాస్థాయిలో స్పెషల్​ ఆఫీసర్
  • క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించాలి
  • నీళ్లు, కరెంట్​పై రివ్యూలో సీఎం సూచనలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తాగునీటికి, కరెంట్​ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఎండాకాలంలో నీరు, కరెంట్​కు డిమాండ్​ పెరుగుతున్నందున ప్రత్యేక ప్రణాళిక తయారుచేసుకోవాలని, వేసవి సమస్యలను అధిగమించాలని ఆయన సూచించారు. తాగు నీరు, విద్యుత్​ సరఫరా అంశాలపై శనివారం ఆయన సెక్రటేరియెట్​లో  రివ్యూ నిర్వహించారు. వేసవిలో కరెంట్​ డిమాండ్​ ఎంత పెరిగిందో వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలపై ఆరా తీశారు. సమస్యలు తలెత్తకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. వేసవి ముగిసేంత వరకు అలర్ట్​గా ఉండాలని సూచించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా పాలన సాగిస్తున్నామని, ఇకపై అదే పరిస్థితి ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. 

ప్రజా సమస్యల పరిష్కారానికి మించిన ప్రయారిటీ తమకు ఇంకేం లేదన్నారు. లోక్​సభ ఎన్నికల దృష్ట్యా తాము ఇతరత్రా పనుల్లో బిజీగా ఉన్నా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ముఖ్యమైన విషయాలు ఏమన్నా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ‘‘ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడొద్దు. రైతులు సాగునీటి కోసం కష్టాలు ఎదుర్కోవద్దు. పరీక్షలు పూర్తయ్యే వరకు స్టూడెంట్ల ప్రిపరేషన్​కు కరెంట్​ కోతల సమస్య రాకూడదు’’ అని  సీఎం ఆదేశించారు. 

ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలి

ఎండా కాలంలో సహజంగానే విద్యుత్​ డిమాండ్​ పెరుగుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘పెరిగిన డిమాండ్​కు తగ్గట్టుగానే  విద్యుత్​ సరఫరా చేయాలి. ఇప్పటికే ఎండలు భగ్గుమంటున్నాయి​. ఏప్రిల్​, మే నెలల్లో మరింతగా ఎండలు పెరిగే అవకాశాలున్నాయి​. పెరిగే డిమాండ్​కు సరిపడా విద్యుత్​ అందుబాటులో ఉంది. అందుకే కరెంట్​ పోయిందనే ఫిర్యాదు రాకుండా చూడాలి. డిమాండ్​కు సరిపోయేలా అందించాలి’’  అని ఆఫీసర్లకు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా ఫిర్యాదు వస్తే అప్రమత్తమై సమస్యను వెంటనే సరిచేయాలన్నారు. రోజురోజుకూ మండుతున్న ఎండలతో విద్యుత్​ డిమాండ్​ పెరుగుతున్నందున విద్యుత్​ లభ్యత, తక్షణ అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్తు సరఫరా చేయడం ద్వారా కొత్త రికార్డును సృషించామని అన్నారు.  ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగింది. పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోతలు లేకుండా విద్యుత్తును అందించడంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయి” అని సీఎం ప్రశంసించారు. ఇదే సందర్భంగా.. డిప్యూటీ సీఎం,  విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్కను ప్రత్యేకంగా అభినందించారు. 

తాగునీటిపై కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి 

వేసవిలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ ఆఫీసర్​ను ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. వేసవి కోసం గ్రామాలవారీగా ప్రత్యేక డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పారు.  ‘‘రాష్ట్రంలో ఎక్కడ కూడా జనం గొంతెండిపోయే పరిస్థితి ఉండకూడదు. ఎక్కడైనా సమస్య ఉంటే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని పరిష్కరించండి’’ అని సీఎం సూచించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలన్నారు. బోర్ వెల్స్, బావులన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలని చెప్పారు. సమీపంలో ఎలాంటి నీటి వనరులున్నా వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడైనా బోర్లు బాగా లేకపోతే వెంటనే రిపేర్లు చేయించుకోవాలని తాము గతంలో చేసిన సూచనను అధికారులకు గుర్తుచేశారు. అన్ని రిపేర్లు పూర్తయ్యాయా? అని ఆయన ఆరా తీశారు. అవసరాన్ని బట్టి రాష్ట్రస్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్​ సూచించారు.  మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరేలా చూడాలని చెప్పారు. దీని కోసం సరిపడేన్ని ట్యాంకర్లు సమకూర్చుకోవాలని ఆయన ఆదేశించారు. 

విద్యుత్​ సరఫరా భారీగా పెరిగిందన్న ఆఫీసర్లు

గత ఏడాదితో పోలిస్తే డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్తు సరఫరా గణనీయంగా పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల  విద్యుత్తు లోడ్ ఉందని,  గత రెండు వారాలుగా 14,000 మెగా వాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉందని చెప్పారు.  ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ కొనసాగుతుందని విద్యుత్​ అధికారులు సీఎం రేవంత్​రెడ్డికి తెలిపారు. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయిందని,  ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో సగటున రోజుకు 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరిగిందని వివరించారు. అదేవిధంగా గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు అత్యధిక రికార్డు కాగా.. ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో సరికొత్త రికార్డు నమోదైందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్తు సరఫరా మెరుగుపడిందని అధికారులు రివ్యూలో వివరించారు.

ఇప్పటికే ఎండలు భగ్గుమంటున్నాయి​. ఏప్రిల్, మే నెలల్లో మరింతగా పెరిగే అవకాశాలున్నాయి​. డిమాండ్​కు తగ్గట్టుగా కరెంట్​ సరఫరా చేయాలి. సరిపడా విద్యుత్​ అందుబాటులో ఉంది. కరెంట్​ పోయిందనే ఫిర్యాదు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలి.

ఎన్నడూ లేని విధంగా ఈ మార్చిలో విద్యుత్​ డిమాండ్ గణనీయంగా పెరిగింది. పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోతలు లేకుండా కరెంట్​ను అందించడంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయి.


- సీఎం రేవంత్​రెడ్డి