
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ గురువారం (జూలై 24) సీఎంవో అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో వెంటనే సహయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేసేందుకు అధికారులు జిల్లాల్లోనే ఉండాలని ఆదేశించారు.