
హైదరాబాద్: ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. అతిథ్య ఇంగ్లాండ్ జట్టును 6 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను 2–2 తేడాతో సమం చేసింది గిల్ సేన. ఓవల్ టెస్టులో టీమిండియా గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్. ఐదో టెస్ట్ రెండు ఇన్సింగ్సుల్లో కలిపి 9 వికెట్లు తీసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అసలు గెలుపు కష్టమనుకున్న మ్యాచులో సిరాజ్ అద్భుతం చేసి టీమిండియాకు మరుపురాని విజయానందించాడు.
ALSO READ | IND vs ENG 2025: లెక్క సరిచేసిన సిరాజ్.. నిన్న తిట్టినవాళ్ళే ఇవాళ హీరో అంటున్నారు..
ముఖ్యంగా సెకండ్ ఇన్సింగ్స్ లో మియా బాయ్ బౌలింగ్ వేరే లెవల్. అందులోనూ ఐదో రోజు అయితే మరింత స్పెషల్. మ్యాచ్ చివరి రోజు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్ పంపాడు. ఈ మ్యాచులో ఫీల్డింగ్‌లో ఓ తప్పిదంతో విమర్శల పాలైన సిరాజ్.. సెకండ్ ఇన్సింగ్స్లో ఐదు వికెట్లు తీసి విమర్శకుల నోళ్లతోనే ప్రశంసించేలా చేశాడు. ఓవల్ టెస్టులో టీమిండియాను గెలిపించిన సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలోనే హైదరాబాదీ పేసర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇంగ్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో టీమ్ ఇండియా సంచలన విజయం సాధించడం, రెండు ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న మహమ్మద్ సిరాజ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు మరుపురాని విజయం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు సీఎం రేవంత్.