ఇసుకపై పేక మేడలు కట్టారా : సీఎం రేవంత్ రడ్డి

ఇసుకపై పేక మేడలు కట్టారా : సీఎం రేవంత్ రడ్డి
  •  గత బీఆర్ఎస్ సర్కార్ పై సీఎం రేవంత్ ఫైర్ 
  •  త్వరలో ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : ఇసుక కదిలితే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, మరి వాళ్లు ఇసుకపై పేక మేడలు కట్టారా? అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ఆనాటి ప్రభుత్వం రూ.38,500 కోట్లతో 2008లో టెండర్లు పిలిచింది. అప్పటి పెద్దపల్లి ఎంపీ కాకా వెంకటస్వామి సూచనతో ప్రాజెక్టుకు బీఆర్ అంబేద్కర్ పెట్టారు. కానీ ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ చేసి, అంచనాలను రూ.లక్షా 47వేల కోట్లకు పెంచింది” అని రేవంత్ మండిపడ్డారు. 

“మేడిగడ్డలో ఏం డ్యామేజీ జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలియదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా తెలియదు. ఆ డ్యామేజీ అందరికీ చూపించేందుకే మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసినం. కేసీఆర్ తో సహా ప్రతి ఎమ్మెల్యేకు మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. కేసీఆర్ బస్సులో రానంటే ప్రభుత్వ హెలికాప్టర్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రెడీగా ఉంది. మేడిగడ్డకు రావాలని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కోరుతున్నాం” అని అన్నారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ కుంగినంక అక్కడికి ఎవరూ వెళ్లకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది. కొంత మంది అధికారులు ఫైల్స్ మాయం చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. 

దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆ నివేదిక ఇచ్చింది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉంది. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దాం. మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి..  మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండి. మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండి. తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని , డిస్కవరీ చానెల్ లో అద్భుతమని చూపించుకున్నారుగా? దాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పండి” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి విమర్శలు చేశారు.

 తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు? అనేది తేలాల్సి ఉందన్నారు. ‘‘గతంలో హరీశ్ రావును కాళేశ్వర్ రావు అని ఆనాటి గవర్నర్ అన్నారు. కాళేశ్వర్ రావు కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్న” అని చెప్పారు. త్వరలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని, అప్పుడు కాళేశ్వరం కథేంటో సభలో తేలుద్దామని అన్నారు. కాగా, అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తర్వాత సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లారు.