హైదరాబాద్‌లో NALSA సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్ ప్రారంభం

హైదరాబాద్‌లో  NALSA సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్ ప్రారంభం

హైదరాబాద్: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. నగరంలోని తాజ్ కృష్ణలో జరుగుతున్న ‘సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం  రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన న్యాయ సేవలు, న్యాయ సహాయం తదితర అంశాలపై సదస్సులో చర్చలు జరగనున్నాయి.

సదస్సులో ‘ఆన్లైన్ వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ’ అనే అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. డిజిటల్ వేదికల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల భద్రత, వారికి ఎదురవుతున్న ఆన్‌లైన్ వేధింపులు, న్యాయపరమైన రక్షణ వంటి అంశాలపై సదస్సులో చర్చ జరగనుంది. దక్షిణ మండల పరిధిలో న్యాయ సేవల అందుబాటు, ప్రజలకు న్యాయ సహాయం మరింత చేరువ చేయడం వంటి అంశాలపైనా సదస్సులో చర్చలు కొనసాగనున్నాయి.