
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిగిలిన నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్చార్జి దీపాదాస్ మున్షి, సీఈసీ సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ నాలుగు స్థానాలపై ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్ చౌదరి హైదరాబాద్లో నేతలతో చర్చించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను సేకరించారు. స్క్రీనింగ్ కమిటీ నిర్వహించిన సర్వేతో పాటు సునీల్ కనుగోలు నివేదికలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటించనున్నారు.