
ఎంపీటీసీ నుంచి అసెంబ్లీ స్పీకర్ గా ఎదిగిన గడ్డం ప్రసాద్ కృషి ఎంతో అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి.. స్పీకర్ ఎన్నిక విషయంలో సానుకూలంగా సహకరించిన బీఆర్ఎస్,ఎంఐఎం,సీపీఐ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సంప్రదాయం సభలో భవిష్యత్తులో కూడా కొనసాగాలన్నారు. వికారాబాద్ అభివృద్ధిలో గడ్డం ప్రసాద్ ది చెరగని ముద్ర అని అన్నారు. వికారాబాద్ మంచి వైద్యం అందించేందుకు అనువైన ప్రాంతం అని అన్నారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్ కు బాగా తెలుసన్నారు. వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ రావడం ఆయన కృషి ఫలితమేనని చెప్పారు. సభలో అందరి హక్కులను స్పీకర్ కాపాడగలరన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు.
శ్రీధర్ బాబు అడగ్గానే సంపూర్ణ మద్దతిచ్చాం: కేటీఆర్
స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కేసీఆర్ తమను ఆదేశించారని కేటీఆర్ చెప్పారు. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాగే సభ హక్కులను కాపాడాలని కోరారు. సామాన్య ప్రజలు సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు.
చేనేత మంత్రిగా సిరిసిల్లకు వచ్చి కార్మికుల సంక్షేమానికి కృషి చేశారని చెప్పారు.
అంచెలంచెలుగా ఎదిగారు: శ్రీధర్ బాబు
అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కి అభినందనలు తెలిపారు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధ్ బాబు. శాసనసభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారని స్పీకర్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. విపక్షాలు స్పీకర్ కి మద్దతు తెలిపినందుకు విపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ నిర్ణయాలకుతమ సంపూర్ణ మద్దతుంటుందన్నారు. తన తండ్రి శ్రీపాద రావు కూడా ఇదే శాసనసభలో పని చేసి ఆ చైర్ కి ఔన్నత్యంని తీసుకొచ్చారని చెప్పారు.
స్పీకర్ పదవికి వన్నె తెచ్చారు: భట్టి
గడ్డం ప్రసాద్ ఎన్నిక స్పీకర్ పదవికి వన్నె తెచ్చిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా సమస్యలపై, వారి హక్కులపై చర్చిస్తారని ఆశిస్తున్నానన్నారు. గడ్డం ప్రసాద్ చేనేత మంత్రిగా ఎంతో కృషి చేశారని చెప్పారు.