మృతుల్లో ఆరుగురు తెలంగాణోళ్లు సీఎం రేవంత్ దిగ్ర్భాంతి

మృతుల్లో ఆరుగురు తెలంగాణోళ్లు సీఎం రేవంత్ దిగ్ర్భాంతి

గద్వాల, వెలుగు: కర్నూల్ జిల్లా బస్సు ప్రమాదం దుర్ఘటనపై  సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, బస్సు ప్రమాదంలో  తెలంగాణకు చెందిన ఆరుగురు  మృతి చెందారని  రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బస్సు దగ్ధమైన ప్రాంతాన్ని ఆయన  పరిశీలించారు. గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావుతో  మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు  మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో  మొత్తం 19 మంది చనిపోయారని చెప్పారు.

 బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని,  భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా  రాష్ట్ర ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 2013లో మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా పాలెం దగ్గర కూడా బస్సు దగ్ధం కాగా.. 48 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.   ప్రైవేట్ ట్రావెల్స్ అనుభవం,  నైపుణ్యంగల  డ్రైవర్లను నియమించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి వెంట జెన్ కో సీఎండీ హరీశ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. 

అలాగే, బస్సు ప్రమాదం గురించి తెలియగానే  సీఎం ఆదేశాల మేరకు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్,  ఎస్పీ శ్రీనివాసరావు  సంఘటనా స్థలానికి తరలి వెళ్లారు. అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత   డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నట్టు కలెక్టర్ తెలిపారు.