- సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
- ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు బ్రిటన్ డెలిగేట్లకు ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పెట్టే ప్రతి పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని, ప్రభుత్వ విధానాలు స్థిరంగా కొనసాగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైనప్పటికీ ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ తయారీలో దూసుకుపోతున్నదని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో బ్రిటన్ యార్క్‌షైర్ రీజియన్ మేయర్లు ఆలివర్ కాపార్డ్, డేవిడ్ స్కైత్, ట్రేసీ బ్రాబిన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి డెలిగేషన్‌తో సీఎం భేటీ అయ్యారు. తెలంగాణతో ట్రేడ్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ భాగస్వామ్యంపై చర్చించారు. తెలంగాణ ఇప్పుడు దేశీయ రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోటీ పడుతోందని సీఎం వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ను భారీగా విస్తరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్–2026’కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ రూపొందించిన ‘యూకే-ఇండియా సెటా అండ్ రీజినల్ సినర్జీస్’రిపోర్టును ఆవిష్కరించారు.
మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీతో కొత్త రూపు
యువత భవిష్యత్తు, పారిశ్రామిక అవసరాల కోసమే ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్ డాక్యుమెంట్‌ను తెచ్చినట్టు సీఎం తెలిపారు. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నాలెడ్జ్ పార్ట్నర్గా, అంతర్జాతీయ నిపుణుల సలహాలతో దీనిని రూపొందించినట్టు చెప్పారు. బ్రిటన్ ప్రతినిధులు స్పందిస్తూ.. అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్టైల్స్ రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పెట్టుబడులు, విద్యా సంబంధాల కోసం త్వరలోనే మరోసారి తెలంగాణకు వస్తామన్నారు. కాగా, తెలంగాణలోని డిజిటల్ ఎకానమీ, మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయని సౌత్ యార్క్‌షైర్ మేయర్ ఆలివర్ కాపార్డ్ ప్రశంసించారు. అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. జీనోమ్ వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను సందర్శించాలని యూకే ప్రతినిధులను ఆహ్వానించారు.
