కీర్తి సురేష్ లీడ్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘సత్యవన్ సావిత్రి’. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. తమిళ దర్శకుడు మిస్కిన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. బుధవారం ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ‘వాశి’ అనే చిత్రంలో లాయర్ గా మెప్పించిన కీర్తి.. మరోసారి లాయర్‌గా కనిపించింది. అయితే ఈసారి కామెడీ లాయర్ క్యారెక్టర్ ప్లే చేసింది.
పెద్ద అడ్వకేట్‌గా పేరు తెచ్చుకోవాలని చిన్నప్పటినుంచి ఆశపడే సావిత్రి.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయినా ఎలాగోలా లాయర్ చదువు పూర్తి చేస్తుంది. అయితే కోర్టులో ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చీరాని వాదనతో జడ్జిలను ప్రశ్నిస్తూ కోపం తెప్పిస్తుంటుంది. తాను స్ఫూర్తిగా తీసుకునే సీనియర్ లాయర్ మార్కండేయతో ఎప్పటికైనా కోర్టులో తలపడాలనేది ఆమె కోరిక. మరి ఆమె కోరిక నెరవేరిందా, కొత్తగా పెళ్లయిన ఆమెకు భర్తతో ఎదురైన సమస్య ఏమిటి.. అనేది మిగతా కథ.
అమాయకత్వం, తింగరితనం కలగలిసిన లాయర్ పాత్రలో కీర్తి సురేష్ నటన ఆకట్టుకుంది. ఇక మిస్కిన్ ఎప్పటిలాగే సీరియస్ రోల్లో కనిపించారు. ‘హార్ట్ బీట్’ సిరీస్ ఫేమ్ చారుకేష్ ఇందులో కీర్తికి భర్తగా నటించాడు. బాలాశరవణన్, శిల్పా మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. డ్రమ్ స్టిక్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్ 20న సినిమా రిలీజ్ కానుంది.
