- మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల బ్యాంకు రుణాలు: సీతక్క
- సరస్ మేళాలో బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు రూ.75 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సరస్ ఫెయిర్-2026లో మహిళా సంఘాలకు రుణాలివ్వడంలో కీలకంగా వ్యవహరించిన బ్యాంకర్లను మంత్రి సన్మానించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మహిళలతో కలిసి పాల్గొన్నారు. మహిళల పొదుపును ఆర్థిక బలంగా మార్చి, ప్రతి మహిళను విజయవంతమైన వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సరస్ మేళా ప్రాంగణంతో పాటు ప్రభుత్వ ఆఫీసులు.. ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయం, ఖైరతాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్, సచివాలయం, మసాబ్ ట్యాంక్ లోని డీఎస్ఎస్ భవన్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ కమిషనరేట్ ప్రాంగణాల్లో జరిగిన వేడుకల్లోనూ పాల్గొన్నారు.
టీజీవో, టీఎన్జీవో మహిళా విభాగాల ఆధ్వర్యంలో
తెలంగాణ ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం నాంపల్లిలోని టీజీవో భవన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. టీజీవో మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ దీపారెడ్డి, కన్వీనర్ సుజాత ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్ పాల్గొన్నారు. టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సైనీ ముజీబ్, ఉమాదేవి, నిర్మల, రాజకుమారి, శైలజ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ భవన్లో బతుకమ్మ వేడుకలు
తెలంగాణలో మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన సాగుతోందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. బుధవారం గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆస్తులు, పదవులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చని, కానీ సంస్కృతి సంప్రదాయాలు తిరిగిరావన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు.
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో బుధవారం బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. చిన్నతనంలో అమ్మమ్మ ఇంట్లో బతుకమ్మ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు.
