స్పీకర్ కు సీఎం సంఘీభావం..అందరం అండగా ఉంటామని హామీ

స్పీకర్ కు సీఎం సంఘీభావం..అందరం అండగా ఉంటామని హామీ
  • స్పీకర్ కు సీఎం సంఘీభావం..అందరం అండగా ఉంటామని హామీ
  • మంత్రి శ్రీధర్ బాబు, లీగల్​ఎక్స్​పర్ట్స్​తో భేటీ
  • ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యల విషయంపై చర్చ

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ కు వెళ్లి గడ్డం ప్రసాద్ ను కలిశారు. డిప్యూటీ సీఎం భట్టితో కలిసివెళ్లిన సీఎం.. సోమవారం జరిగిన ఘటనలను స్పీకర్ కు వివరించారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై ‘చట్టపరంగా చర్యలు తీసుకుందాం, మీకు మేమంతా అండగా ఉంటాం’అని ఈ సందర్భంగా స్పీకర్ కు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.

అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద సోమవారం పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును, స్పీకర్ పై ఆ నేతలు వాడిన భాషకు సంబంధించిన వీడియో  క్లిప్పుంగులను గడ్డం ప్రసాద్ తో కలిసి సీఎం పరిశీలించారు. బాధ్యులపై కఠినంగానే వ్యవహరిద్దామని సీఎం ఈ  సందర్భంగా స్పీకర్ కు హామీ ఇచ్చారు. అనంతరం తన ఛాంబర్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మరికొందరు న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు.

ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వాలను రద్దు చేస్తే న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడంపై ఇందులో చర్చించారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునే విషయంపై చర్చించారు. అనంతరం పార్టీ వ్యవహారాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ సాగింది.