మా ఎమ్మెల్సీ  క్షమాపణ చెప్పారు..తన వ్యాఖ్యలను వెనక్కితీసుకున్నారు : హరీశ్ రావు 

మా ఎమ్మెల్సీ  క్షమాపణ చెప్పారు..తన వ్యాఖ్యలను వెనక్కితీసుకున్నారు : హరీశ్ రావు 
  • చీర లాగడంపై సీపీకి ఫిర్యాదు చేశాం
  • మా ఎమ్మెల్యేలపైనే తిరిగి కేసులు పెట్టారు 
  • అసెంబ్లీలో హరీశ్ రావు కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని, క్షమాపణ చెప్పారని అసెంబ్లీలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి తాను అనలేదని మధు చెప్పారన్నారు. ఒకవేళ అలా భావించి ఉంటే ఆ పదాలను విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకుంటున్నానని, విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారని.. లిఖితపూర్వకంగా మీడియా ముఖంగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు. స్పీకర్ అంటే తమకు ఎనలేని అభిమానమనం ఉందన్నారు.

స్పీకర్ నొచ్చుకుని ఉంటే పార్టీ తరఫున కూడా విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. మంగళవారం అసెంబ్లీలో హరీశ్ రావు మాట్లాడుతూ.. “సభ్యుడు సారీ చెప్పినా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారో వేయండి. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం” అని అన్నారు. అసెంబ్లీ బయట మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పోలీసులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల మీద జరిగిన దాడిని పోలీసులు పరిశీలిస్తారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

“శ్రీధర్ బాబుకు కూడా అక్కాచెల్లెళ్లు ఉన్నారు. సొంత అక్కాచెల్లెళ్ల మీద ఇలాంటి దాడి జరిగితే కేవలం పరిశీలిస్తాం అని సరిపెట్టుకుంటారా. ఆయన నుంచి కనీస సానుభూతి, విచారం ఆశించాం కానీ అది జరగలేదు”అని హరీశ్ అన్నారు. 

దాడికి గురైన వారిపైనే కేసులు పెట్టారు.. 

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మగ పోలీసులు దాడి చేశారని, ఆమె గొంతు పిసికారని, ఇదంతా వీడియోల్లో స్పష్టంగా ఉందని హరీశ్ రావు చెప్పారు. ‘‘మరో మాజీ మంత్రి, మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి  చీర లాగడంతో ఆమె కన్నీరు పెట్టుకున్న దృశ్యాలను చూశాం. సీపీకి, పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కంప్లైంట్ ఇస్తే.. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి మీదే రివర్స్‌‌‌‌‌‌‌‌లో కేసులు పెట్టారు”అని విమర్శించారు. ‘‘ఇది రాష్ట్రంలోని యావత్ మహిళాలోకంపై జరిగిన దాడి.

ఇదెక్కడి పద్ధతి స్పీకర్.. మీరే మమ్మల్ని కాపాడాలి. ఈ అసెంబ్లీ ఇప్పుడు గౌరవ సభ కాదు, కౌరవ సభగా మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి కలియుగ దుశ్శాసనుడిలా మారారు. నాడు మహాభారతంలో కౌరవులకు పట్టిన గతే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుంది”అని హరీశ్ హెచ్చరించారు.

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి

రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని హరీశ్ రావు అన్నారు. అన్ని వర్గాలపై దాడులు చేస్తూ అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్, కేంద్రం జోక్యం చేసుకుని తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. సభలో చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే అటెన్షన్​ డైవర్షన్​కు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరగలేదని స్పీకర్ ఎలా అంటారని ప్రశ్నించారు. మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ ​చేసి జవహర్​నగర్ పోలీస్​స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘స్పీకర్ కు తాతా మధు క్షమాపణ చెప్పారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగితే ఎందుకు చర్చ చేయడం లేదు. ఎందుకు మహిళా ఎమ్మెల్యేలకు మైకులు ఇవ్వడం లేదు. కలియుగ దుశ్శాసనుడు రేవంత్ రెడ్డి. గౌరవ సభను కౌరవ సభగా చేసిండు. బీజేపీ వాళ్లు ప్లకార్డులు తీసుకెళ్తే అడ్డుకోరు.. మేం టీ షర్ట్స్ వేసుకుంటే అడ్డుకుంటరు. బీజేపీ, కాంగ్రెస్ బంధం ఇదే కదా’’ అని ఆయన ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి చేసినందుకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.