
- కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం.. వారి మౌనం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం
- సమస్యలపై పోరాడేది వారే.. ఎవరినైనా గద్దె దించగలరు
- ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరఫున పోరాడే నేతలు రావట్లేదు
- కొందరు ఐదేండ్లు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడట్లేదు
- సురవరం సుధాకర్‌రెడ్డి ఆదర్శవంతమైన నేత
- ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామని వెల్లడి
- రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ
హైదరాబాద్, వెలుగు: కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం అని, వారు మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని, ఆయనకు మద్దతుగా కమ్యూనిస్టులు, ప్రతిపక్షాలు కలిసి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బిహార్ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఓట్లను తొలగిస్తున్నదని ఆరోపించారు. మహారాష్ట్రలో కేవలం 4 నెలల్లోనే కొత్తగా కోటి ఓట్లు ఎలా వచ్చాయో అంతా ఆలోచన చేయాలన్నారు.
మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ప్రజల ప్రాథమిక హక్కు ఓటును తొలగించడంపై పోరాటం చేయాలని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌తోపాటు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్, రిటైర్డ్ సీజేఐ ఎన్వీ రమణ, కేవీ రామచందర్, ఇతర వామపక్ష నేతలు, తదితరులు హాజరయ్యారు.
సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం సురవరం సుధాకర్‌రెడ్డిపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తున్నాయంటేనే దేశంలో పవర్‌లో ఉన్నవారు ఎన్నికల కమిషన్‌ను కూడా భాగస్వామ్యం చేసుకొని అధికారాన్ని పదిలపరుచుకోవాలనుకుంటున్నారని, వారికి వ్యతిరేకంగా ఉండేవారిపైకి ఈడీ, సీబీఐని పంపుతున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్‌ను పంపి ఓట్లు తొలగిస్తున్నారని, అధికారం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం సమాజంలో ప్రజాస్వామిక మూల సిద్ధాంతానికి విరుద్ధంగా పెరిగిపోతున్న విపరీత పోకడలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాథమిక హక్కులను హరించే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రజలను చైతన్య పరిచే ఆలోచన ఎవరూ చేయడం లేదు. అందుకోసం ఐక్య కార్యాచరణ నిర్మించుకోవాలి. అప్పుడే సురవరం లాంటి నేతకు ఘనమైన నివాళి’’ అని వ్యాఖ్యానించారు.
సురవరం పేరు శాశ్వతంగా నిలిచేలా నిర్ణయం
సురవరం సుధాకర్‌రెడ్డి ఆదర్శవంతమైన నేత అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు ఎంత ఎత్తుకు ఎదిగినా నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదని అన్నారు ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామని చెప్పారు. ప్రజలకు సురవరం సుధాకర్‌రెడ్డి ఎప్పుడూ గుర్తుండేలా మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ‘‘సిద్ధాంతాలు చెప్పడమే కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం 65 ఏండ్లు నిబద్ధతతో జీవించడం ద్వారా సురవరానికి ఆ గౌరవం దక్కింది. వారు ఏ జెండాను మోశారో, ఏ జెండా మోయడం గొప్పగా భావించారో.. తుదిశ్వాస తర్వాత కూడా ఆ జెండా నీడనే విశ్రమించారు” అని తెలిపారు. ప్రజల్లో గుర్తింపు పొందిన మహనీయుల పేర్లు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నిలవాలని అన్నారు.
అందుకే తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి, కోఠి మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టుకున్నామని చెప్పారు. ప్రజల్లో చైతన్యం నింపి గోల్కొండ కోటను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటున్నామని తెలిపారు. ఒక ప్రాంతం నుంచి సమాజంలో గుర్తింపు పొందిన్నప్పుడు చెప్పుకోవడానికి ఆ ప్రాంతవాసులకు గర్వంగా ఉంటుందని అన్నారు. ‘మొదటితరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వంటి వారు పాలమూరు జిల్లాకు వన్నెతెచ్చారు. రెండో తరంలో జైపాల్‌రెడ్డి, సురవరం సుధాకర్‌రెడ్డి వంటివారు రాజకీయాల్లో రాణించారు. జైపాల్‌రెడ్డి దక్షిణ భారత్ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన యంగెస్ట్ ఎంపీ. వారెప్పుడు సమాజంలో గౌరవం పొందుతూనే ఉంటారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు” అని తెలిపారు.
కొందరు రాజకీయం అంటేనే అధికారం అనుకుంటున్నరు
కొందరు రాజకీయం అంటేనే అధికారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఐదేండ్లు కూడా ప్రతిపక్షంగా ఉండేందుకు ఇష్టపడట్లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కమ్యూనిస్టులు మాత్రం ఎన్నేండ్లయినా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడతారని, ప్రజల తరఫున మాట్లాడటం, పోరాడటం పెద్ద బాధ్యత అని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరఫున పోరాడేందుకు నేతలు ముందుకు రావట్లేదన్నారు.
సమస్యలపై పోరాడి, ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను దించడంలో కమ్యూనిస్టులు ముందున్నారని, ఎవరూ అధికారంలో ఉన్నా.. ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటారని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయినా కమ్యూనిస్టులదే కీలక పాత్ర ఉంటుందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా కమ్యూనిస్టులే కారణమని పేర్కొన్నారు. కమ్యూనిజం అంటే లైబ్రరీలో ఉండే పుస్తకం కాదని, పేదల సమస్యలను అర్థం చేసుకోవడమని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పోరాటాలు చేయడమే కమ్యూనిజమని, ఇప్పుడున్న జాతీయ రాజకీయ పరిస్థితుల్లో సురవరంలాంటి నేతల సేవలు ఎంతో అవసరమన్నారు.
సురవరం లెజెండరీ పర్సనాలిటీ : మహేశ్ గౌడ్
సురవరం సుధాకర్‌రెడ్డి లెజెండరీ పర్సనాలిటీ అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కొనియాడారు. తాను ఎన్ఎస్ యూఐ నాయకుడిగా ఉన్నప్పుడు తొలిసారి సురవరం సుధాకర్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు. ఆయన నిబద్ధతతో రాజకీయాలు నడిపారన్నారు. కమ్యూనిజం ఎప్పుడూ సజీవంగా ఉంటుందని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్‌రెడ్డి పోరాటం చేశారని రిటైర్డ్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
వారి ఇబ్బందులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నివేదికలు ఇచ్చారని గుర్తుచేశారు. నిస్వార్థంగా ప్రజల కోసమే జీవించడం ఎలాగో సురవరం సుధాకర్‌రెడ్డి జీవితాన్ని చూస్తే అర్థమవుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ప్రతి రాజకీయ నాయకుడికి ఆయన జీవితం ఒక పాఠంగా నిలుస్తుందన్నారు. దశాబ్దానికిపైగా సురవరం, తాను కలిసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు బీవీ రాఘవులు తెలిపారు. సురవరం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.