- ప్రతిపక్ష నేత హోదాలో లేఖ రాస్తే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడ్తాం
- పదేండ్ల పాలనలో పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతలకు
- నికర జలాలు ఎందుకు సాధించలే?
- వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు
- మీ కోపం, మీ అసూయతో అభివృద్ధిని అడ్డుకోవద్దు
- పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అద్భుత ఫలితాలు
- 8,335 గ్రామ పంచాయతీలను అంటే 66 శాతం గెలుచుకున్నం
- 2/3 మెజారిటీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నీటి ప్రయోజనాలను పదేండ్ల కాలంలో పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టిన జల ద్రోహులెవరో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘బీఆర్ఎస్ ఆఫీసులో ప్రెస్ మీట్లు కాదు.. సభకు వచ్చి చర్చించాలి” అని సూచించారు. 66 శాతం గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా జయకేతనం ఎగురవేశారని, ఈ తీర్పు రెండేండ్ల తమ పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌కు దమ్ముంటే కృష్ణా, గోదావరి జలాల మీద చర్చకు రావాలి. ఆయన ప్రతిపక్ష నేతగా లేఖ రాస్తే మూడు, నాలుగు రోజులైనా సరే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడతాం. కూలంకషంగా వివరాలతో వచ్చి కూర్చుందాం. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్హయాంలోనే తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేసిండు. ఆధారాలతో సభలో చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే ప్రశ్నించాలని సవాల్ విసురుతున్నా” అని తేల్చిచెప్పారు.
రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడొద్దు
వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఒకాయన కడుపులో మూసీ కంటే ఎక్కువ విషం ఉంది. మీ అసూయతో తెలంగాణ అభివృద్ధికి నష్టం చేయకండి. 2029లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుంది. మేం 2/3 మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తాం.. మీరు 1/3లో ఉంటారు. గజ్వేల్‌లో కేసీఆర్ క్రియాశీలకంగా లేరని ప్రజలు తీర్పు ఇచ్చి అక్కడ కూడా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేంద్రం కక్షతో కేసులు పెట్టినా ప్రజలు మా వెంటే ఉన్నారు” అని ఆయన తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు –-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతలకు నికర జలాలు ఎందుకు సాధించలేదని ఆయన ప్రశ్నించారు. సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టు హక్కులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధించారని తెలిపారు. ‘‘మీ(బీఆర్ఎస్) ద్రోహాలను ఆధారాలతో సభ ముందు పెడతాం. బురద జల్లి పారిపోతామంటే ప్రజలు అమాయకులు కాదు” అని సీఎం పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనపై కూడా ప్రజాస్వామికంగా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎట్లా ముందుకు వెళ్లాలన్నది అందరి అభిప్రాయాలతో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.
66 శాతం గ్రామాల్లో కాంగ్రెస్ హవా
8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘12,702 గ్రామ పంచాయతీల ఫలితాల్లో 7,527 కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ రెబల్స్ నెగ్గారు. మొత్తంగా 8,335 గ్రామ పంచాయతీలు అంటే 66% ఫలితాలను కాంగ్రెస్ సాధించింది. బీఆర్ఎస్, -బీజేపీ కూటమిగా పోటీ చేసి.. 3,511 (బీఆర్ఎస్) ప్లస్ 710 (బీజేపీ) కలిపి 4,221 అంటే 33% స్థానాలకే పరిమితమయ్యారు. సీపీఐ, సీపీఎం, ఇతరులు కలిపి 1% గెలిచారు. ఈ తీర్పు మా రెండేండ్ల పరిపాలనకు నిదర్శనం. గతంలో మేం గెలవని 21 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు విజయం సాధించాం. 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగితే 87 చోట్ల కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ దుబ్బాక, హుజూరాబాద్, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, సిర్పూర్ కాగజ్ నగర్లో మాత్రమే మెజారిటీ సాధించగా.. బీజేపీకి ముథోల్‌లో మాత్రమే మెజారిటీ దక్కింది” అని పేర్కొన్నారు. కార్యకర్తల కష్టం, ప్రజల ఆశీర్వాదం వల్లే కాంగ్రెస్‌కు అద్భుత విజయం సాధ్యమైందన్నారు. ‘‘ 2023 డిసెంబర్ 7న ప్రజాపాలన బాధ్యతలు చేపట్టి, రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు మా ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను” అని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, ఎక్కడా అధికారిక లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందిని అభినందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని గెలిచామో పూర్తి లిస్ట్ ఇస్తామని, కావాలంటే నిజనిర్ధారణ కమిటీ వేసుకుని ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి పరిశీలించవచ్చని ఆయన సూచించారు.
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ ఏదీ గెల్వలే
ఎక్కువ సర్పంచులు గెలిచామని కేటీఆర్ రోజుకో జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు కదా అని మీడియా ప్రశ్నించగా.. సీఎం బదులిచ్చారు. ‘‘94 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని పంచాయతీలు గెలిచిందో పర్సంటేజీతో అధికారిక నోటు విడుదల చేస్తున్నాను. ఆ నోట్ తీసుకుని వెళ్లి నిజనిర్ధారణ చేసుకోండి” అని పేర్కొన్నారు. ‘‘కేటీఆర్ కాంగ్రెస్ గురించి ఆలోచన చేయట్లేదు. హరీశ్వెనకాల నుంచి తవ్వుతున్నడు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అసెంబ్లీ, లోక్‌సభ, ఉప ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదీ బీఆర్ఎస్ గెలవలేదు’’ అని సీఎం తెలిపారు. హరీశ్ వర్గం సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో ‘కేటీఆర్ ఉంటే పార్టీ మిగలదు, హరీశ్‌కు నాయకత్వం ఇవ్వాలి’ అనే స్లోగన్‌తో ముందుకు వస్తున్నదని పేర్కొన్నారు. వాటిని డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయాలతో ప్రజలకు గానీ ప్రభుత్వానికి గానీ సంబంధం లేదన్నారు. గురుకులాల అంశాలపై బాధ్యత లేకుండా ప్రశ్నలు వేయొద్దని ఆయన సూచించారు. గత పదేండ్లలో జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి.. ఎన్ని గురుకులాలు, ఎక్కడ ఏమి జరిగిందో లెక్కలతో చూస్తామని, ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కవిత చేస్తున్న ఆరోపణలతో పాటు కేఏ పాల్, ఇంకేవరైనా సరే చేస్తున్న కంప్లయింట్స్‌లో విషయం ఉంటే ఎంక్వైరీ ఉంటుందని ఆయన తెలిపారు.
ఏడో గ్యారెంటీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
సంక్షేమమే తమ బలమని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘ఆదాయం పెంచుతాం.. పేదలకు పంచుతాం.. అని వారు(బీఆర్ఎస్) మాటలు చెప్పారు. చేయలేదు. మేము చేసి చూపిస్తున్నాం. సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ.9 వేల కోట్ల రైతు భరోసా, రూ.22 వేల కోట్లతో రైతులకు మద్దతు, 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి కార్యక్రమాలను చేస్తున్నాం. కేసీఆర్ చేయని ఎన్నో పనులు ఈరోజు మేం చేశాం’’ అని పేర్కొన్నారు. ఆదాయం పెంచుకుంటూనే దుబారాను తగ్గిస్తూ ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నామని, ఎంత ఆదాయం పెంచితే అంత పేదలకు ప్రయోజనం చేకూరేలా ఖచ్చితంగా వినియోగిస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ప్రజలకు మేలు చేయడమే తమ నిత్య తాపత్రయమని, అమలులో రాజీ ఉండదని స్పష్టం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారెంటీగా ఇచ్చామని.. గతంలో లాగా నిర్బంధాలు, కక్ష సాధింపులు తమ ప్రభుత్వంలో లేవన్నారు. ‘‘ప్రత్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేశారు. అధికార దుర్వినియోగం చేయలేదు. ఓడినప్పుడు కుంగిపోం, గెలిస్తే అహంకారంతో కండ్లు నెత్తికెక్కవు” అని ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, సీతక్క, సీఎం సలహాదారులు వేం నరేందర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇకపై కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తయ్
పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లిద్దరూ కలిసి వచ్చినా మేం ఎదుర్కొని 8 సీట్లు సాధించాం. 40 శాతానికి పైగా ఓట్లు పొందాం. ఇదే భవిష్యత్తుకు బలమైన పునాది’’ అని తెలిపారు. ఇకపై కూడా బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చిందన్నారు. “ఇయ్యాల కేటీఆర్ మాట్లాడతాడు.. మరుసటి రోజు కిషన్‌రెడ్డి మాట్లాడతాడు.. అదే ప్రెస్‌మీట్లు చూడండి. కిషన్‌రెడ్డి మాటలు వింటే బీఆర్‌ఎస్ ఉన్నప్పుడు ఏదో అద్భుతాలు జరిగిపోయినట్లుగా, బీఆర్‌ఎస్ ఉంటేనే బాగుంటుందన్న భావన స్పష్టంగా కనిపిస్తుంది. కిషన్‌రెడ్డి వ్యవహారశైలి చూసిన తర్వాత కూడా ఎవరికైనా అనుమానం ఉంటుందా? అందుకే నేను స్పష్టంగా చెప్తున్న.. వాళ్లిద్దరూ కలిసి పోటీ చేస్తారు. కాంగ్రెస్ వన్ థర్డ్, వాళ్లిద్దరూ కలిసి టూ థర్డ్స్ అన్నట్లుగా రాజకీయ సమీకర ణలు తయారు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టుకెళ్లండి
పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ నిర్ణయంపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు. ‘‘అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యపై హరీశ్‌రావు వైఖరిని చూసి జాలి పడుతున్న. ఎమ్మెల్యేల నుంచి నిర్వహణ కోసం డబ్బులు వసూలు చేస్తూ ఇప్పుడు తమ వాళ్లు కాదు అనడం విడ్డూరం. సంతలో పిల్లల్లా ఎమ్మెల్యేలను చూడటం మీ నికృష్ట రాజకీయానికి నిదర్శనం. స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టుకు వెళ్లండి. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య గురించి హరీశ్ రావు గతంలో మైక్ అడిగారు, స్పీకర్ ప్రకటించిన ప్రతి బులెటిన్ చూశారు.. ఇప్పుడు తమ వాళ్లు కాదనడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం’’ అని సీఎం అన్నారు.
