- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వాళ్లపై సీబీఐ కేసు పెట్టండి
- రూ.లక్ష కోట్ల కాళేశ్వరం అవినీతి కేసులో చర్యలు తీసుకోండి
- కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లోగా అరెస్టు చేస్తామని చెప్పినవ్గా..
- మరి కేసును అప్పగించి 3 నెలలైనా ఎందుకు చర్యలు తీసుకుంటలే?
- ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఎందుకు అనుమతిస్తలే?
- కవిత చెప్పినట్టు ఇవన్నీ బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేసే చర్యలే
- తెరవెనుక బీఆర్ఎస్‌కు బీజేపీ సపోర్ట్ చేస్తున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు:
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈ నెల 11లోగా సీబీఐతో కేసీఆర్, హరీశ్ రావును అరెస్ట్ చేయించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే వాళ్లిద్దరినీ 48 గంటల్లో జైల్లో వేస్తామన్న కిషన్‌రెడ్డి.. ఆ కేసును సీబీఐకి ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఎందుకు ఆ పని చేయడం లేదని నిలదీశారు.
‘‘కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నేను ఒక్కటే సవాల్ చేస్తున్నా.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాకపోతే, ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం కాకపోతే, మీ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే, ఎలాంటి గూడుపుఠాణి లేనట్లయితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతి కేసులో ఈ నెల 11లోపు కేసీఆర్, హరీశ్‌రావుపై సీబీఐ కేసు పెట్టండి.. వాళ్లిద్దరినీ అరెస్టు చేయండి” అని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి రహమత్‌నగర్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఏంగా మారిందని, అందులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్అధికారంలోకి వచ్చక కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్‌ను చర్లపల్లి జైల్లో వేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారని, కానీ ఆ కేసును తాము సీబీఐకి అప్పగించి మూడు నెలలైనా ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారు.
ఇక ఫార్ములా–ఈ రేసు కేసులో కేటీఆర్ రూ. 50 కోట్ల అవినీతికి పాల్పడినట్లు అన్ని ఆధారాలతో గవర్నర్ ముందుంచి అరెస్టుకు అనుమతి ఇవ్వాలని కోరితే.. రెండు నెలలు దాటినా రాజ్‌భవన్ నుంచి అనుమతి రాలేదని, ఇది తప్పు చేసిన వారిని వెనుకేసుకొచ్చే పని కాకుంటే మరేమిటని ప్రశ్నించారు.‘‘ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఎందుకు అనుకుంటుందో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇవన్నీ బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేసే చర్యలు కాకుంటే మరేమిటి. ఈ మాటలు మేము అనడం లేదు. కవితే స్వయంగా చెప్పారు.
తాను జైల్లో ఉన్నప్పుడు ఈ దిశగా ప్రయత్నాలు జరగడం వల్లే తట్టుకోలేక బయటకు వచ్చానని ఆమె చెప్పారు” అని సీఎం పేర్కొన్నారు. ‘‘కారు స్టీరింగ్ మోదీ చేతిలో ఉంది.. అందుకే ఇక్కడ బీఆర్ఎస్‌ను వెనుకేసుకొచ్చే పనిలో బీజేపి ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారిపోతున్నది.. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలు గమనించాలి’’ అని అన్నారు. ఈ రెండు పార్టీల్లో ఓటు దేనికి వేసినా అది బీజేపీకే వేసినట్లవుతుందని పేర్కొన్నారు.
ఆడబిడ్డను గెంటేసి సెంటిమెంటా?
బీఆర్ఎస్ నాయకులు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఆడబిడ్డ మాగంటి సునీతను గెలిపించాలని కేటీఆర్ కోరుతున్నారు. కానీ ఇదే కేటీఆర్.. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తదని తన సొంత చెల్లిని ఇంట్లోంచి మెడబట్టి బయటకు గెంటేశారు. తన అన్న తనను వీధిలో పడేసిండని సొంత చెల్లి ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఇల్లిల్లు తిరుగుతూ కంటతడిపెట్టుకుంటూ చెప్తున్నది.. అలాంటోడు మాగంటి సునీతను ఆదుకుందామంటే ఎలా నమ్మాలి?’’ అని ప్రశ్నించారు.
కేటీఆర్ లాంటి వ్యక్తులు ఎవరింట్లోనైనా ఉంటే అక్కాచెల్లెళ్లు వాతలు పెడుతారని అన్నారు. సొంత చెల్లెకి అన్నం పెట్టలేనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానన్నట్టుగా కేటీఆర్ తీరు ఉందని విమర్శించారు. ‘‘కేసీఆర్‌కు మహిళల సెంటిమెంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 2007లో పీజేఆర్ చనిపోతే.. ఆయన కుటుంబంపై పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసేందుకు ప్రత్యర్థి పార్టీ నేత చంద్రబాబు ఒప్పుకున్నా.. కేసీఆర్ మాత్రం ఏండ్ల తరబడి ఉన్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కి బీఆర్ఎస్ తరపునఅభ్యర్థిని పోటీకి నిలబెట్టి పీజేఆర్ కుటుంబానికి అన్యాయం చేశారు.
ఎన్నికను ఏకగ్రీవం చేయాలని పీజేఆర్ కుటుంబం కేసీఆర్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్తే.. మూడు గంటల పాటు ఎర్రటి ఎండలో నిలబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. ఇయ్యాల మాగంటి సునీతను గెలిపించాలని కోరే నైతిక హక్కు ఆయనకు ఎక్కడిది? ఆనాడు మీకో నీతి, ఇప్పుడు మాకో నీతా..’’ అని కేసీఆర్‌ను నిలదీశారు. ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టినందుకు రహమత్ నగర్ చౌరస్తాలో కేటీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పదేండ్ల పాటు చెత్త కనిపించలేదా?
పదేండ్ల పాటు సీఎంగా కేసీఆర్, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్నారని.. నాటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇదే చెత్తాచెదారం ఉందని, ఇందుకు కారణ మెవరని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పదేండ్లు బెంజ్ కారులో తిరిగిన బిల్లారంగాలు.. ఇప్పుడా కారు పంచర్ కావడంతో గల్లీల్లో ఆటోల్లో తిరుగుతూ ఆటోవాలాలను రెచ్చగొడ్తున్నారని మండిపడ్డారు.
‘‘ మేం ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేయడానికా? సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం ఆపడానికా? దేనికి మిమ్మల్ని గెలిపించాలి?’’ అని నిలదీశారు. రబ్చరు చెప్పులు లేని కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, హరీశ్ రావుకు, కవితకు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
నవీన్‌ను గెలిపిస్తే అభివృద్ధి నా బాధ్యత..
నవీన్ యాదవ్‌ను 30 వేల మెజార్టీతో గెలిపిస్తే జూబ్లీహిల్స్నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల తర్వాత నియో జకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పారు. ‘‘మూడుసార్లు ఇక్కడి ఎంపీగా బీజేపీకి, మరో మూడుసార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీటింగ్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
