గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవట్లే..ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా తీరు మార్చుకోవట్లే: సీఎం రేవంత్‌‌‌‌

గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవట్లే..ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా తీరు మార్చుకోవట్లే: సీఎం రేవంత్‌‌‌‌
  • మేం వాళ్లలా పాలకులం కాదు..  ప్రజా సేవకులం
  • గెలిస్తే ఉప్పొంగం.. ఓడితే కుంగిపోం
  • రెండేండ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినం
  • ఎస్సీ జనాభా 17 శాతం ఉంటే 30 శాతం పదవులిచ్చినం
  • నల్లమల ఫారెస్ట్​లో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ టెంపుల్ నిర్మిస్తం
  • వచ్చే ఏడాది అక్కడే జయంతి జరుపుకుందాం
  • ప్రతి తండాకు బీటీ రోడ్డు, పంచాయతీ  బిల్డింగ్, స్కూల్ నిర్మిస్తామని హామీ
  • సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరు

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో ప్రజలను వృత్తుల పేరుతో అణచివేసిన వారు, ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఇంకా తీరు మార్చుకోవడం లేదని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి విమర్శించారు. గత పాలకులు (బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌) ప్రజా తీర్పును ఒప్పుకోవడం లేదన్నారు. ‘‘వాళ్లు తాము పాలించడానికే పుట్టామన్న అహంకారంతో ఉన్నారు. అధికారంలోకి రాగానే మేం పాలకులం కాదు, ప్రజా సేవకులం అని స్పష్టం చేశాం. అలాగే నడచుకుంటున్నాం’’ అని తెలిపారు. హైదరాబాద్‌‌‌‌ బంజారాహిల్స్‌‌‌‌లోని బంజారా భవన్‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అంతకుముందు బంజారా భవన్‌‌‌‌లో సంత్  సేవాలాల్ మహరాజ్  విగ్రహానికి పూలమాల వేశారు. బంజారాలు ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి మాట్లాడారు. గత పాలకులు గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి కొన్ని కులాలను అవే వృత్తులకు పరిమితం చేయాలని చూశారని, కానీ తమ ప్రభుత్వం వారిని డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌‌లుగా చూడాలని ఆకాంక్షిస్తున్నదని రేవంత్‌ చెప్పారు.  గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు వెళ్లి కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు.  రెండేండ్లలోనే తాము 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.  ఇందులో 86 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారన్నారు. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని, కానీ పేద బిడ్డల చదువు కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు..

మున్సిపల్‌‌ శాఖ తనవద్ద ఉంది కాబట్టే.. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని అన్నానని, కానీ తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. ‘‘గత పదేండ్లు పాలించిన పాలకులు రేషన్ కార్డులు ఇవ్వలేదు. గ్రూప్స్​ జాబ్‌‌లు భర్తీ చేయలేదు.  మా ప్రభుత్వం వచ్చాక పేదలకు రేషన్ కార్డులు ఇచ్చాం. సన్న బియ్యం ఇస్తున్నాం.” అని వివరించారు.  రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17 శాతం ఉంటే.. తమ ప్రభుత్వంలో 30 శాతం పదవులిచ్చామని చెప్పారు. ‘‘నలుగురు మంత్రులు, స్పీకర్, విప్, ఇతర పదవులు దళితులకు ఇచ్చాం. ఇది ఎన్నడైనా ఊహించారా? ’’ అని అన్నారు. ఏ దళితుడిని అయితే గత పాలకులు సీఎం చేస్తా అని మోసం చేశారో.. ఆ దళితుడినే అధ్యక్షా అని మైక్ అడిగే పరిస్థితిని తీసుకొచ్చానన్నారు.  ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం, బీఆర్ అంబేద్కర్ మనకు ఇచ్చిన ఆయుధమని పేర్కొన్నారు. 

నల్లమలలో సంత్‌‌ సేవాలాల్‌‌ పుణ్యక్షేత్రం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని, వచ్చే ఏడాది జయంతి వేడుకలను అక్కడే జరుపుకుందామని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. దీని కోసం ఆర్కిటెక్టులతో అద్భుతమైన డిజైన్లు రూపొందించాలని ఆర్‌‌‌‌ అండ్‌‌ బీ శాఖ అధికారులను ఆదేశించారు.  “ మానవజాతి చెడును విడిచి శాంతి మార్గంలో,  భక్తితో సన్మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవాలాల్.. దేశంలో 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. అలాంటి మహనీయుడి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం మా ప్రభుత్వ బాధ్యత” అని పేర్కొన్నారు. 

రాష్ట్రంలోని ప్రతి తండాకు బీటీ రోడ్డు, స్కూల్ బిల్డింగ్, గ్రామ పంచాయతీ భవనం ఉండాలని, దీని కోసం వెంటనే ప్లాన్ సిద్ధం చేయాలని సీఎస్‌‌కు ఆదేశాలు జారీ చేశారు. అటవీ ప్రాంతాల్లో కరెంట్ లేని తండాల కోసం సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని, దీనిని అచ్చంపేట నుంచి ప్రారంభించామని రేవంత్‌ చెప్పారు. సంత్ సేవాలాల్ తన జీవితం మొత్తాన్ని గిరిజనుల అభ్యున్నతికే అంకితం చేశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 15న సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు మంజూరు చేసిందని గుర్తు చేశారు.

మరో 20 ఏండ్లు ప్రజాసేవ చేస్తా..

బంజారాలు ఒకనాడు రాష్ట్రానికి సీఎం కావాలి అనేది తన ఆలోచన అని రేవంత్‌‌రెడ్డి తెలిపారు. సేవాలాల్ మహరాజ్ చూపిన శాంతి మార్గంలో నడవాలని, గిరిజన సోదరులు నిరాశ చెందకుండా నిలబడి పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికల కంటే ముందు 12 ఏండ్ల ఢిల్లీ పాలన చూశారు. 10 ఏండ్ల గడీల పాలన చూశారు. రెండేండ్ల  ప్రజా పాలన చూశారు. 

తీర్పు ఇవ్వాలని మున్సిపల్ ఎన్నికలకు ముందు పిలుపునిచ్చా. 85 నుంచి 90 శాతం సీట్లలో మమ్మల్ని గెలిపించారు. గెలిపిస్తే విర్రవీగం. గెలిస్తే ఉప్పొంగం. ఓడితే కుంగిపోం. 20 ఏండ్లలో  అన్ని పదవులు చూశా. ప్రజలకు ఎక్కడా దూరం కాలే. పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలే. వచ్చే 20 ఏండ్లు పేద ప్రజలకు సేవ చేస్తా” అని వ్యాఖ్యానించారు.