
పార్టీలకతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని పిలుపునిచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పరకటించిన క్రమంలో ,మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం తెలంగాణ ప్రజలకు గర్వ కారణమని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు, జగన్, ఒవైసీ ఒకే మాటపై నిలబడి పార్టీలకతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్.
దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని.. ఓట్ల చోరీతో దేశాన్ని పరిపాలించాలని చూస్తున్నారని అన్నారు సీఎం రేవంత్. రాజ్యాంగాన్ని రక్షించడం అందరి బాధ్యత అని.. రాజ్యాంగ సంస్థలను రక్షించుకోవడం ఇప్పుడు అవసరమని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చేస్తున్నవారిని ఓడించాలని.. రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడమే కాకుండా.. రాజ్యాంగ నిపుణుడిగా సుదర్శన్ రెడ్డికి పేరు ఉందని అన్నారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఇండియా కూటమికి తెలంగాణ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా ఒకతాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్.