సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని ఫోన్ అప్రమత్తంగా ఉండండి

సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని ఫోన్ అప్రమత్తంగా ఉండండి
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి 
  • మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం 
  • ఆఫీసర్లు సెలవులు రద్దు చేసుకోవాలి 
  • వర్షాలు, వరదలపై సమీక్ష 
  • సీఎంకు ఫోన్​ చేసి ఆరా తీసిన ప్రధాని మోదీ

హైదరాబాద్, వెలుగు: 24 గంటలు అలర్ట్ గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్​లో సమాచారం ఇవ్వాలని సూచించారు.వర్షాలు, వరదలపై సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో ఫోన్ లో మాట్లాడారు. 

జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టినవారు వెంటనే  రద్దు చేసుకొని పనుల్లో నిమగ్నం కావాలన్నారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సీఏంవో కార్యాలయానికి సమాచారం పంపాలని ఆదేశించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప.. ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలి . 24 గంటలు అలర్ట్ గా ఉండాలి. సహాయక కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పాలుపంచుకోవాలి” అని పిలుపునిచ్చారు.