
- ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నయ్
- కాంగ్రెస్‌ను దొంగ దెబ్బ తీయడానికి కుట్రలు చేస్తున్నయ్: సీఎం
- కవిత అరెస్టును మేం తప్పుపట్టడం లేదు
- కానీ, ఇన్నేండ్లు సీరియల్లాగా నడిపి ఎన్నికల షెడ్యూల్‌కు ముందురోజే అరెస్టు చేసుడేంది?
- బిడ్డ అరెస్ట్ అయినా కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నడు?
- అరెస్టు గురించి తెలిసినా రోడ్ షోలో మోదీ ఎందుకు స్పందించలే?
- మోదీ, కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఏంది?
- ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ పక్కన ముగ్గురు కూడా మిగలరని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల స్టంట్ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఇంత కాలం సాగదీసి,లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ఒక్క రోజు ముందు కవితను అరెస్టు చేయడం దేనికి సంకేతమో ప్రజలే అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. అవినీతిపై చర్యలు తీసుకున్నామని చెప్పి మోదీ, సానుభూతి పేరిట కేసీఆర్ ఓట్ల కోసం ఆడుతున్న డ్రామాలో ఇది భాగమని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 12 ఎంపీ సీట్లు వస్తాయన్న సర్వే సంస్థల అంచనాలను తెలుసుకొని కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. కవిత అరెస్టును తాము తప్పుపట్టడం లేదని, అవినీతిపరులను శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ, అది ఏ సమయంలో జరిగిందన్న అంశంపైనే తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు.
ఇది పూర్తిగా ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వేసిన ఎత్తుగడ అని ఆరోపించారు. వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం తన ఇంట్లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో ముందు ఈడీ, తర్వాత మోదీ వచ్చేవాళ్లు. కానీ ఈసారి ఈడీ, మోదీ ఇద్దరు కలిసే వచ్చారు’’ అని అన్నారు. అవినీతిని అడ్డుకుంటున్నామని బీజేపీకి, ఆడబిడ్డను అరెస్టు చేశారని బీఆర్ఎస్కు సానుభూతితో ఓట్లు పడాలన్నదే కవిత అరెస్ట్ వెనుక ప్లాన్ అని సీఎం విమర్శించారు. ‘‘కవిత.. కేసీఆర్ కూతురు. ఆమె ఇంటికి ఈడీ అధికారులు వెళ్లి సోదాలు నిర్వహించి అరెస్టు చేసుకొని వెళ్తుంటే కేసీఆర్ రాలేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? పోనీ తండ్రిగా కాకపోయినా తన ఎమ్మెల్సీని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగానైనా అక్కడికి రావాలి కదా?! అక్కడి పోలీసులను వివరాలు అడగాలి కదా?! కనీసం ఈ ఘటనపై ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదు. ఎందుకు అరెస్టు చేశారో వివరణ ఇవ్వలేదు’’ అని అన్నారు.
కేసీఆర్ అవినీతిపై కేసెందుకు పెట్టలే?
కవిత ఇంట్లో సోదాలు, అరెస్టు తతంగం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సాగిందని, ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్న ప్రధాని మోదీ మల్కాజ్‌గిరిలో రోడ్ షోలో గానీ, తర్వాత గానీ ఎందుకు స్పందించలేదని రేవంత్ ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండా ఈడీ ఈ అరెస్టుకు పూనుకోదన్నారు. ఇంత జరిగినా కేసీఆర్, మోదీ మౌనంగా ఉన్నారంటే దాని వెనుక ఉన్న వ్యూహం ఏమిటో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
దశాబ్ద కాలంగా అణచివేతకు, నిర్బంధానికి గురైన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛాయుత, ప్రజా పాలనను అందిస్తున్న తమ సర్కారును కూలదోసేందుకు సాగిస్తున్న కుట్రలో భాగంగానే ఇది జరిగిందని ఆరోపించారు. ఢిల్లీ సర్కారు మీద కోపంతో తెర మీదికి తెచ్చిన అక్కడి లిక్కర్ కేసులో ఎంతో మందితోపాటు ఇప్పుడు కవితను అరెస్టు చేసిన మోదీ ప్రభుత్వం పదేండ్ల కేసీఆర్ హయాంలోని లక్షల కోట్ల అవినీతిపై ఎందుకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ అంశం బీజేపీ, బీఆర్ఎస్ ఏండ్లుగా సాగిస్తున్న నిరంతర ధారావాహిక అని, కాకపోతే కవిత అరెస్టుతో అది పతాక స్థాయికి వచ్చిందన్నారు.
పొలిటికల్ డ్రామాలు ఆపాలి
ప్రధాని మోదీకి తెలంగాణ అనే పదం పలికే అర్హతనే లేదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘మోదీకి తెలంగాణలో పర్యటించే హక్కు లేదు. తల్లిని చంపి పిల్లను బతికిచ్చిండ్రని మోదీ తెలంగాణ గురించి అవహేళన చేసిండు. అవమానించిండు. అలాంటి వ్యక్తికి తెలంగాణలో మాట్లాడే హక్కు లేదు” అని మండిపడ్డారు. మోదీ ఇప్పటికైనా పొలిటికల్ డ్రామాలు కట్టిపెట్టి తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు.
మోదీ తెలంగాణకు ఏమిచ్చిండు. ఇండ్లిచ్చిడా..రైతుల ఆదాయం రెండింతలు చేసిండా.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తా అన్నడు. అట్లయితే ఇప్పటికే 20 కోట్ల ఉద్యోగాలు ఇయ్యాలె. మరి తెలంగాణలో ఎందరికి ఇచ్చిండో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం ఇస్తా అన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్, ఐఐఎం, ఎన్టీపీసీలో 2,400 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మెట్రో రైలుకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని అడిగారు. ఈ ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానం లేదు కాబట్టే ప్రస్తుతం సాగుతున్న అరెస్టులని ఆయన వ్యాఖ్యానించారు.
కూలుస్తరా? ముట్టుకొని సూడుండ్రి
‘‘కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించదంటూ కేసీఆర్, కడియం శ్రీహరి లాంటోళ్లు అంటున్నరు. బీజేపీ నేత లక్ష్మణ్ కూడా ఎన్నికల తర్వాత మా సర్కారు కూలిపోతదంటున్నడు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకే రాగం ఎత్తుకుంటున్నరు. మరి మేం సైలెంట్‌గా ఉండాల్నా? ముట్టి సూడుండ్రి.. ఏమైతదో చూపిస్త. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే మీ పక్కన ముగ్గురు, నలుగురు తప్ప ఐదో వ్యక్తి కూడా మిగలరు” అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ‘‘ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చినం. దించాలని చూస్తే పొద్దుగల్ల మీరు లేచి చూసుకుంటే మీ పక్కన ఎవరూ ఉండరు.
మీరు తొడుక్కున్న బట్టలు కూడా మీ ఒంటి మీద ఉండవు. తారీఖు చెప్పండి.. పరిణామాలు ఏమిటో నేను చూపిస్త. దేనికైనా సిద్ధం” అని మండిపడ్డారు. వాళ్లు పడగొట్టాలని చూస్తే నిలబెట్టుకోడం ఎలాగో తమకు తెలుసన్నారు. ‘‘నన్ను కలువడానికి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు నాతో మాట్లాడుతూ.. తొందర్లోనే బీజేపీలో బీఆర్ఎస్ కలిసిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నదని చెప్తున్నరు.
తమ పార్టీ(బీఆర్ఎస్) వాళ్లకు పిచ్చి లేసిందని వాళ్లు అంటున్నరు. ప్రస్తుతం రాష్ట్రంలో సమస్యల్ని వినే సీఎం, ప్రభుత్వం దొరికిందని, అలాంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎలా వదులుకుంటామని, అండగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నరు. మీరు ఎప్పుడు చెబితే అప్పడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడుతమని అంటున్నరు” అని సీఎం వివరించారు.
తాము పార్టీ ఫిరాయింపులను గానీ, కక్ష సాధింపులను గానీ చేపట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. కానీ, కాళ్లల్ల కట్టెబెట్టి కొందరు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం సహజమైన న్యాయమే కదా అని సీఎం అన్నారు. ‘‘నన్ను నా పని చేయనిస్తే, ప్రతిపక్షంగా వాళ్ల పని వాళ్లు చేసుకోవచ్చు. లేదని యవ్వారాలు చేస్తే దానికి తగిన ప్రణాళిక మా దగ్గర ఉంది’’ అని హెచ్చరించారు. తమ ప్రభుత్వం కచ్చితంగా పదేండ్లు అధికారంలో ఉంటుందని, అందులో ఎవ్వరూ ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ప్రజల కోసం కేంద్రంతో సఖ్యత
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భేషజాలు, పట్టింపులు, పట్టుదలకు పోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు, ప్రయోజ నాలు రావని తాను ఒక మెట్టు దిగి కేంద్రంతో సత్సంబంధాలు మెయిం టెయిన్ చేస్తున్నామన్నారు. తమ మంత్రు లతో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్ర మంత్రు లను కలిసి రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తున్నామని చెప్పారు. మెట్రో రైలు, పాలమూరు– రంగారెడ్డికి జాతీయ హోదా, ఇతర రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ‘వైబ్రెంట్ తెలంగాణ 2050’ పేరిట విజన్ రూపొందించుకొని ముందుకెళ్తున్నామని వివరించారు.
వంద రోజుల పాలనపై ఎంతో సంతృప్తిగా ఉన్నం
కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చి ఆదివారానికి (మార్చి 17) వంద రోజులు అవుతుందని, తమ పని తీరు పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కావాలి.. మార్పు రావాలి అని జనం దగ్గరికి వెళ్లి ఆరు గ్యారంటీల గురించి చెప్పినం. అందులో చాలా వరకు అమలు పరిచినం. ఒకటి రెండు త్వరలో ఇంప్లిమెంట్ చేస్తం” అని స్పష్టం చేశారు.
తమకన్నా ముందు పదేండ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను వందేండ్లకు సరిపడా విధ్వంసం చేశారని మండిపడ్డారు. అసలు ఏం చేసినా పట్టాలెక్కలేనంతగా ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ‘‘గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముడులు వేస్తే వాటన్నింటిని విప్పుకుంటూ, పరిష్కరించుకుంటూ పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లినం. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినం. రాజీవ్ ఆరోగ్య శ్రీని 10 లక్షలకు పెంచినం. రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నం.
ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను ప్రారంభించినం. 3 నెల్లలో 30 వేల ఉద్యోగాలిచ్చినం. టీఎస్పీఎస్సీని పక్షాళన చేశాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నం. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు శాశ్వత ప్రాతిపదికన ప్రజా భవన్‌ను ఏర్పాటు చేసినం. మా వంద రోజుల పాలనలోనే అన్ని సమస్యలు పరిష్కారమైనట్లు మేమే భావించడం లేదు.. మిగితా ఇష్యూలనన్నింటిపై దృష్టి సారిస్తం” అని సీఎం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలను రాష్ట్రంలో రెఫరెండంగానే భావిస్తామని అన్నారు.