హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సెంటిమెంటా.. డెవలప్మెంటా ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో జూబ్లీహిల్స్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి వివేక్ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ కోసం రూ.400 కోట్లు సాంక్షన్ చేయించారన్నారు. మంత్రి వివేక్ నేతృత్వంలో చాలా పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నామని.. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 50 రోజుల్లోనే 4వేల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రూ.4 వేల కోట్ల పనులు చేయిస్తానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం (నవంబర్ 5) షేక్ పేట్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రులు వివేక్ వివేక్, అజారుద్దీన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ చనిపోవడంతో ఆయన సతీమణి సునీతను గెలిపించాలని సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ ప్రజలను ఓట్లు అడుగుతోంది.
గతంలో పీజేఆర్ చనిపోతే అప్పుడు ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా మద్దతు ఇచ్చారు. కానీ, కేసీఆర్ మాత్రం అభ్యర్థిని నిలబెట్టి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నారు. గతంలో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబ నుంచే ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉండేది. కానీ పీజేఆర్ చనిపోయినప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టి ఆ మంచి సంప్రదాయానికి కేసీఆర్ తూట్లు పొడిచారని విమర్శించారు. పీజేఆర్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పిన తర్వాతే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓట్లు అడగాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు.. మరీ కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
