
- ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు, 21 వేల కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలోనైనా మీరు చేశారా?
- నిరూపిస్తే ఢిల్లీ నడి బజారులో క్షమాపణ చెప్త: సీఎం రేవంత్
- మాపైకి కేసీఆర్ గాలిబ్యాచ్ను వదిలారు
- మేం ఏ పని చేసినా వాళ్లు వద్దంటున్నరు
- మూసీ ప్రక్షాళన చేయాలో వద్దో కేసీఆర్ చెప్పాలి
- ఆయన చేసిన అప్పులకు 65 వేల కోట్లు కట్టినం
- సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చితీరుతం
- సన్నొడ్లు వేయండి.. బోనస్ ఇచ్చే బాధ్యత మాది
- బ్రాహ్మణవెల్లంల పూర్తితో లక్ష ఎకరాలకు నీళ్లు
- ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేసి మరో మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లిస్తం
- నల్గొండ విజయోత్సవ సభలో వెల్లడి
నల్గొండ, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ అడ్డా మీదికొచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన నిజాలు తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తే బాగుండేదని అన్నారు. ‘‘నడ్డాజీ.. మీరు మా అడ్డా మీదికొచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు. నేను మిమ్మల్నే కాదు.. ప్రధాని నరేంద్ర మోదీని అడుగుతున్నా.. మోదీ 14 ఏండ్లు గుజరాత్ సీఎంగా ఉన్నరు. 11 ఏండ్ల నుంచి ప్రధానిగా ఉంటున్నరు. ఈ 25 ఏండ్లలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఒక్క సంవత్సరంలో 55 వేల ఉద్యోగాలిచ్చినట్టు మీరు నిరూపిస్తే ఢిల్లీ నడి బజారులో మీకు క్షమాపణ చెప్పి తలవంచుకుని వస్తా. లేదంటే శాఖల వారీగా మేం ఇచ్చిన ఉద్యోగాల లెక్క అప్పజెప్తా. మీరు, మీ నాయకులు మా ప్రభుత్వాన్ని అభినందించాలి.
మొదటి ఏడాదిలోనే 25 లక్షల 50 వేల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా మా ప్రభుత్వానిదే’’ అని తెలిపారు. కేసీఆర్‌కు, మోదీకి తాను సవాల్ విసురుతున్నానని.. వారు అధికారంలోఉన్న టైంలో గానీ, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనాగానీ ఇంత పెద్దమొత్తంలో రైతు రుణమాఫీ చేస్తే తమమంత్రులతో సహా క్షమాపణలు చెప్తామని పేర్కొన్నారు.‘‘ఏది పడ్తే అది మాట్లాడితే చెల్లదు నడ్డాజీ.. మీరు కూడా కేసీఆర్ లెక్క మాట్లాడకండి. కేసీఆర్మాట్లాడిన మాటలనే కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ నకలు కొడుతున్నరు. దొంగోళ్ల సోపతి పడ్తే దొంగల బండి ఎక్కుతరు. అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతది. ఇప్పటికైనా మీరు మారండి.. ఆలోచన చేయండి” అని రేవంత్ సూచించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నీటిని విడుదల చేశారు. తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ -2 నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం నల్గొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో మాట్లాడారు.
ఏడాది పాలనలో అద్భుతమైన విజయాలు..
వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ పథకాల పేటెంట్ కాంగ్రెస్‌కే సొంతమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘గతంలో వైఎస్ హయాంలోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చాం. మళ్లీ ఇప్పుడు మేం వచ్చాక ఉచిత విద్యుత్ సప్లై చేస్తున్నాం. గృహలక్ష్మీ కింద 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. వంటగ్యాస్‌ను రూ.500కే అందిస్తున్నాం. 66 లక్షల ఎకరాల్లో కోటి 53 లక్షల టన్నుల వడ్లు పండించి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో 5లక్షల ఎకరాల్లో వరి, అందులో 2లక్షల 70 వేల ఎకరాల్లో సన్నాలు పండించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇక నుంచి రైతులు సన్న వడ్లు మాత్రమే పండించాలి. కచ్చితంగా రూ.500 బోనస్చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రాబోయే రోజుల్లో పేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తాం. హాస్టళ్లలోని విద్యార్థులకు సన్న బియ్యంతోనే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తాం” అని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ చేసిన అప్పులకు65 వేల కోట్లు కట్టినం..
కాంగ్రెస్ పార్టీ రూ.16 వేల కోట్ల మిగులు రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్‌కు అప్పగిస్తే, పదేండ్లలో రూ.7లక్షల కోట్ల అప్పులతో దివాలా తీయించారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘కేసీఆర్ ఇచ్చిన రూ.7 లక్షల కోట్ల అప్పులతో మేం ప్రయాణం మొదలుపెట్టినం. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెలా అసలు, మిత్తీ కలిపి రూ.6,500 కోట్లు కడుతున్నం. రాష్ట్రంలో 70 లక్షల రైతుల కుటుంబాలకు రూ.55 వేల కోట్లు ఖర్చు పెడితే కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన అప్పుకు ఒక్క ఏడాదిలోనే అసలు, మిత్తీ కలిపి రూ.65 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. తెలంగాణను కేసీఆర్ ఎంత భ్రష్టు పట్టించిండో ఆర్థికవేత్తలు ఆలోచన చేయాలి” అని సూచించారు. ‘‘ఎవరెన్ని మాటలు చెప్పినా నమ్మొద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతి తర్వాత రైతుభరోసా అమలు చేస్తాం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము పడ్తుంటే బీఆర్ఎస్ నేతల గుండెలు గుబిల్లుమంటాయి. రుణమాఫీ చేస్తానని ఓట్టేసి చెప్పినట్టుగానే నల్గొండ గడ్డ మీద ఓట్టేసి మరీ చెప్తున్నా.. సంక్రాంతి తర్వాత రైతులకు రైతుభరోసా ఇచ్చితీరుతాం” అని తెలిపారు.
కేసీఆర్.. అసెంబ్లీకి రండి..
అధికారంలో ఉంటేనే చలాయిస్తా, ఓడిపోతే ఫామ్‌హౌస్‌లో ఉంటా అనే విధానం కేసీఆర్‌కు మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. ‘‘కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా.. మేం అందరం ఎన్నికల్లో పోటి చేసినం. ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉన్నాం. రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నారు. శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద సూటిగా నిలదీశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడిగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నా, సీఎల్పీ హోదా లేకుండా చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో ఐదుగురు ఎమ్మెల్యేలతో పంచపాండువుల్లాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వెంటబెట్టుకుని కేసీఆర్ తో కొట్లాడారు. నంబర్లు ముఖ్యం కాదు, ప్రజా సమస్యలు ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత’’ అని అన్నారు.
‘‘కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయ్యింది. కానీ ఈ ఏడాదిలో ఎప్పుడూ కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం తెలంగాణ సమజానికి మంచిది కాదు. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోండి.. అసెంబ్లీకి రండి.. ఒక ఎ మ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, పదేండ్లు సీఎంగా పని చేసిన మీ అనుభవంతో ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడండి’’ అని సూచించారు. ‘‘మీకు (కేసీఆర్) ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే మీరు మాట్లాడాలి. కానీ ఒక గాలి బ్యాచ్ ను(కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి) మాపైకి వదిలారు. మా ప్రభుత్వం ఏం చేసినా వద్దనడం తప్ప వాళ్లకు ఇంకోటి తెలుస్తలేదు. గ్రూప్ 1 పరీక్షలు వద్దంటరు. డీఎస్సీ వద్దంటరు. మూసీ ప్రక్షాళన వద్దంటరు.. మూసీ ప్రక్షాళన కావాలో, వద్దో కేసీఆర్ స్పష్టం చేయాలి’’ అని సవాల్‌విసిరారు.
నల్గొండ జిల్లాకే ఎక్కువ నష్టం..
బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాకే ఎక్కువ నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘గతంలో కాంగ్రెస్ హయాంలో ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారం కోసం ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం మొదలుపెట్టాం. కానీ బీఆర్ఎస్హయాంలో ఈ ప్రాజెక్టులేవీ పూర్తిచేయలేదు. ఇక ఆ పరిస్థితి ఉండదు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తిచేసి లక్ష ఎకరాలకు నీళ్లివ్వబోతున్నాం. త్వరలో 44 కిలోమీటర్ల సొరంగం పనులను పూర్తిచేసి ఎస్ఎల్బీసీ ద్వారా మరో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 500కు పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తాం’’ అని చెప్పారు.
మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తాం..
మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేసి నల్గొండ ప్రజలకు మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ‘‘ఎవరు అడ్డుకున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. నల్గొండ ప్రజల కష్టాలు చూసే మూసీ ప్రక్షాళన చేపట్టాం. మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండలో ఎవరూ బతుకలేరు. అది పూర్తి చేసి నల్గొండ జిల్లాకు పరిశ్రమల వ్యర్థాలు, కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తాం. అడ్డొచ్చిన వారి సంగతి మీరు చూసుకోండి.. అలాంటి వారికి మూసీ వద్దనే గోరీ కట్టే శక్తి మీకుంది’’ అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. మూసీ ప్రక్షాళన వద్దంటే నల్గొండ బిడ్డలు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా ఇవ్వరని బీఆర్ఎస్నేతలను హెచ్చరించారు. 50 వేల ఎకరాల్లో కొత్త సిటీ నిర్మించి నిరుద్యోగ సమస్య పరిష్కరించేలా అంతర్జాతీయ కంపెనీలను తీసుకొస్తామన్నారు.
తెలంగాణను దేశానికే రోల్ మోడల్ చేస్తం
అప్పులు తీర్చుకుంటూ ముందుకుపోతున్నం: డిప్యూటీ సీఎం భట్టి
రాబోయే నాలుగేండ్లలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ముందుకుపోతున్నామని తెలిపారు. నల్గొండలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ‘‘అన్ని రంగాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతున్నం. మెడికల్ కాలేజీలు ప్రారంభించి పేదలకు మెరుగైన వైద్యం దగ్గర చేసినం. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినం. ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేసినం. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది. జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. పదేండ్లు గడిచినా.. 10 కిలో మీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని తవ్వలేదు’’అని భట్టి విక్రమార్క అన్నారు.
3 లక్షలకు ఎకరాలకు సాగునీరిస్తం: మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని రెండేండ్లలో పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ‘‘గత పదేండ్లు నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వాటిని పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందిస్తామనడం హర్షించదగ్గ విషయం’’అని ఉత్తమ్ తెలిపారు.
నల్లగొండను బంగారుకొండ చేస్తం: మంత్రి వెంకట్‌రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నల్లగొండ జిల్లాను బంగారు కొండగా చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ అని, 30 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని కేసీఆర్ ఏమో ఫామ్‌హౌస్‌లో పడుకున్నడని విమర్శించారు.