దమ్ముంటే గుజరాత్‎లో ఆ పని చేయండి: బీజేపీకి CM రేవంత్ సవాల్

దమ్ముంటే గుజరాత్‎లో ఆ పని చేయండి: బీజేపీకి CM రేవంత్ సవాల్

న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వ్యవహరిస్తోన్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తోందని.. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపి.. పార్లమెంట్‎లో అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం (జూలై 23) కాంగ్రెస్ ఎంపీలతో కలిసి అక్కడ మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులపై బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు వితండవాదం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మీరు ఇచ్చిన హామీని మీరే అమలు చేసుకోవాలని ఆయన అంటున్నారు.. కానీ కాంగ్రెస్ కు ఓ రాజ్యాంగం, బీజేపీకి ఓ రాజ్యాంగం ఉండదని.. బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చురకలంటించారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లిం కోటా తొలగిస్తే బీసీ బిల్లులకు మద్దతిస్తామని కేంద్రమంత్రులు అంటున్నారు. మరీ మహారాష్ట్ర, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‎లో ఎప్పటి నుంచో బీసీ రిజర్వేషన్లలోనే ముస్లింలకు కోటా ఉంది.

దమ్ముంటే ముందు అక్కడ తొలగించి.. తర్వాత తెలంగాణ గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. బీజేపీ వైఖరి ముస్లిం కోటాను అడ్డుకునే కుట్రగానే మేం భావిస్తున్నామన్నారు. బీసీ బిల్లులకు ఆమోదం తెలపకుండా సాకులు వెతుకుతున్నారని.. ముస్లిం కోటాను అడ్డంపెట్టి బీజేపీ నేతలు బీసీ బిల్లులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం బీసీ బిల్లులు ఆమోదించేలా విపక్షాన్నింటినీ ఏకం చేస్తామన్నారు.