అసెంబ్లీలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

అసెంబ్లీలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్: చీకటి పాలన అంతమైందని, ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్లామని,  ఇవాళ సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితిని కల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆదర్శవంతమైన పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజల చెమటవాసన చూడమని నిషేధించిన ప్రగతిభవన్ కంచెలు బద్ధలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించింది తమ ప్రభుత్వమని చెప్పారు. అప్పట్లో హోం మంత్రి మహమూద్ అలీ, ఆర్ధికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు కూడా ప్రగతిభవన్ లోకి ప్రవేశం ఉండేది  కాదని, ప్రజాయుద్ధ నౌక గద్దరన్నను కూడా ఎర్రటి ఎండలో ప్రగతి భవన్ గేటు వద్ద కూర్చోబెట్టి తిప్పి పంపిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. 

నిరంకుశత్వం ఎక్కువ కాలం చెల్లదని అన్నారు. నిన్న అధికార పక్షంలో ఉన్న వాళ్లను ఇవాళ ప్రతిపక్షంలోకి పంపారని, ప్రజాతీర్పును గౌరవించే సభ బయటికే పంపుతారని అన్నారు. తాము నిర్బంధాలతో ప్రభుత్వం సాగించాలని అనుకుంటే అంత సేపు మాట్లాడినా సంయమనంతో ఉండేవాళ్లం కాదన్నారు. తాము  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే మార్షల్స్ ను పెట్టి గొర్రెల్లా తమను ఈడ్చి పారేసినోళ్లు అటువైపు ఉన్నారని అన్నారు.  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ను శాసన సభ్యత్వం రద్దు చేసిన చీకటి రోజులని ఈ సభ మరిచిపోదన్నారు.  మేనేజ్ మెంట్ కోటాలో వస్తే ఈ  ప్రాబ్లమ్స్ ఉంటాయంటూ పరోక్షంగా మాజీ మంత్రి కేటీఆర్ కు చురకలు అంటించారు. 

చట్టాలు చేసేది శాసన సభలోనే..

మేనేజ్ మెంట్  కోటాలో సభకు వచ్చిన వారికి శాసన వ్యవస్థ అర్థం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. కేబినెట్ లో పాలసీలను ఆమోదించుకొని తెచ్చి శాసన సభలోనే చట్టాలు చేస్తారని సీఎం చెప్పారు. ‘కేసీఆర్.. తెలంగాణ అమరుల  కుటుంబీకులను  పిలిచి బుక్కెడు బువ్వ పెట్టిండా..? వాళ్ల గురించి పట్టించుకోని సీఎం.. కొడుకుకు, అల్లుడికి మంత్రి పదవులు ఇచ్చిండు.. బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. కుటుంబం మీద ఇంత ప్రేమ ఉన్నడు.. పార్టీ ఫిరాయించినోళ్లను మంత్రులను చేసిన మీరు అమరుల కుటుంబాలకు ఏం చేసిండ్రు’అని రేవంత్ రెడ్డి అన్నారు. 
రాజ్యసభ సీటు రూ. 450 కోట్లకు అమ్ముకున్నరు

కరోనా సమయంలో మందులు బ్లాక్ చేసిన అమ్ముకున్న వ్యాపారికి రూ. 450 కోట్లకు రాజ్య సభ సీటును అమ్ముకున్న ఘనత బీఆర్ఎస్  పార్టీదన్నారు.  డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని తెలంగాణ వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం గ్రూప్1 ఉద్యోగానికి రాజీనామా చేసినందుకు ఆమెకు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేసిందా..? అని ప్రశ్నించారు. నళినికి న్యాయం జరగలేదు బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని అన్నారు.  ధర్నా చౌక్ ను తొలగించి నిర్బంధాలే కొనసాగుతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్ ప్రభు త్వానిదన్నారు.  ధర్నా చౌక్ ను పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదల్చుకుంటే అభినందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు.  ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుపడటం కాదు.. ధర్నా చౌక్ కు వెళ్లి కేటీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చినట్టు ఉంటుందన్నారు. రైతు ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉన్నదని, రాజ్యసభలో కేంద్రం ప్రకటించిన లెక్కలే ఇందుకు నిదర్శనమని అన్నారు.