మంత్రులూ.. బీ అలర్ట్!..పనిగట్టుకుని బద్నాం చేస్తున్నరు

మంత్రులూ.. బీ అలర్ట్!..పనిగట్టుకుని బద్నాం చేస్తున్నరు
  •     పనిగట్టుకుని బద్నాం చేస్తున్నరు: సీఎం  
  •     బేస్​లెస్ ఆరోపణలు చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. మంత్రులపై పనిగట్టుకుని చేస్తున్న ఆరోపణల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు తెలిసింది. మంత్రులు అక్రమాలు చేస్తున్నట్టు ఇటీవలి కాలంలో ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అబద్ధాలతో బద్నామ్ చేసేలా ప్రతి పక్షాల వ్యవహారశైలి ఉన్నందున శాఖల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు అయిన ఆరు నెలల కాలంలోనే విపక్షాలు ఈ రకంగా మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని సీఎం సీరియస్​ తీసుకున్నారు. దీంతో ప్రభుత్వంలో జరుగుతున్న పనులపై తప్పుడు లీకులు ఇస్తున్న వారిపైనా నిఘా పెట్టాలని.. డిపార్ట్​మెంట్లలో కింది స్థాయిలోనూ అక్రమాలకు తావు లేకుండా చూడాలని సీఎం రేవంత్ మంత్రులకు సూచించారు. ఆయా మంత్రులు ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ.. తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిసింది. తనపై కూడా లేనిపోనివి సృష్టించే విధంగా ప్రతిపక్షాల తీరు కనిపిస్తున్నదని.. లోక్​సభ ఎన్నికల ఫలితాల తరువాతనైనా వారు తీరు మార్చుకోకపోతే తగిన రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నట్లు సమాచారం.

ఉత్తమ్, పొన్నం, జూపల్లిపై..

సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్లైయాష్ అక్రమ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతోనే జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కొత్త బీర్ బ్రాండ్లకు అనుమతి విషయంలో అక్రమాలు జరిగాయని మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే అవన్ని కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలుగా తేలాయి. ఇలా బేస్​లెస్​గా ఆరోపణలు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకున్నది. ప్రభుత్వాన్ని పనిగట్టుకుని బద్నాం చేస్తే చట్టపరమైన చర్యలకు వెనకాడొద్దని సీఎం మంత్రులకు సూచించనట్టు తెలుస్తున్నది.