- 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తం: సీఎం రేవంత్రెడ్డి
- ఈసారి 58 శాతం సాగైన సన్నాలు.. కొనుగోళ్లలో గోల్మాల్ జరగకుండా కట్టడి
- తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సన్నవడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని.. ఈసారి 48 గంటల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు.
గురువారం సెక్రటేరియెట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సన్నవడ్ల సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లోనే వేర్వేరు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా సెంటర్లు ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. ఇంకా ఎక్కడైనా అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
‘‘రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించవద్దు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలి. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదు. రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా పరిష్కరించాలి”అని సీఎం సూచించారు.
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి..
సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాబట్టి కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఎలాంటి తప్పులు, అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. లేకపోతే గోల్మాల్జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. వడ్లు కొనేటప్పుడు నిర్దేశించిన ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రానికి ఒక నంబర్ కేటాయించాలని.. ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైనా అదే నంబర్ వేయాలని సూచించారు.
దీంతో ఎక్కడ.. ఏ దశలో గోల్మాల్ జరిగిందో సులభంగా తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. సన్న రకాలను ధ్రువీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే, సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని మార్గాల్లో పకడ్బందీగా నిఘా ఉంచాలని, చెక్ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
ప్రతి కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి..
కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గోనె సంచులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలని సీఎం సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించేందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలను చేరవేయాలని, దానికి అనుగుణంగా కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రతి రోజు కలెక్టర్లు తమ జిల్లాలో జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించాలని, ఉదయం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. పాత పది జిల్లాలకు నియమించిన ప్రత్యేకాధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలుంటే ఏ రోజుకారోజు పరిష్కరించాలని, సివిల్ సప్లయిస్ విభాగంలో 24 బై 7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
రేపటిలోగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలి..
అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మొత్తం 11,062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కాగా, ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు. సీఎస్ శాంతికుమారి, సివిల్ సప్లయిస్ ఎండీ డీఎస్ చౌహన్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సమావేశంలో పాల్గొన్నారు.
వంద శాతం సన్నాలు పండించే రోజులు వస్తయ్..
ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణంలో 58 శాతం సన్న రకాలు సాగయ్యాయని సీఎం తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి దిగుబడి మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా క్రమంగా రాష్ట్రంలో వంద శాతం సన్నవడ్లు పండించే రోజులు వస్తాయన్నారు. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదని, ఎఫ్సీఐ వద్ద కూడా భారీగా నిల్వలున్నా యని, అందుకే సన్నాల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
ఈసారి వచ్చే 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ట్రేడర్లు, మిల్లర్లు, కొనుగోలు చేసే ధాన్యం, రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు పక్కనపెడితే.. 91 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందులో 44 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉంటాయని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ మిల్లర్లకు ఇచ్చే ధాన్యం విషయంలో కలెక్టర్లు నిబంధనలను పాటించాలని హెచ్చరించారు. డీఫాల్ట్ లేని మిల్లర్లకే ధాన్యం ఇవ్వాలని సూచించారు.