
గుల్జార్ హౌస్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందన్నారు రేవంత్. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని చెప్పారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ టీమ్ తమ శక్తి యుక్తులు ప్రదర్శించిందన్నారు రేవంత్ .
మే 18న ఉదయం చార్మినార్ మీర్ చౌక్ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయటంతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఐజీ నాగిరెడ్డిని ఫోన్ లో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అక్కడున్న బాధిత కుటుంబీకులతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.