
హైదరాబాద్..ఆదివారం(మే18) వరుస అగ్ని ప్రమాదాలతో హడలెత్తిపోయింది.ఉదయం చార్మినార్ దగ్గర గుల్జార్ హౌజ్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు..మధ్యాహ్నం మైలార్దేవ్ పల్లిలో మూడంతస్తుల భవనంలో మరో అగ్ని ప్రమాదం..ఆదివారం సాయంత్రం చర్లపల్లిలో పెట్రోల్ బంక్ లో ఫైర్ యాక్సిడెంట్.. ఇలా ఆదివారం మొత్తం వరుస అగ్ని ప్రమాదాలతో హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తిపోయారు.
ఆదివారం ఉదయం పాతబస్తీ గుల్జార్హౌజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారులతో సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10మంది మృతిచెందడం అందరినీ కలచివేసింది. ప్రమాదంలో చనిపోయిన 17 మంది మృతుల్లో నలుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, 8 మంది పదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. మొత్తం70 ఫైర్ సిబ్బంది, 17 మంది అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 8 మంది సిబ్బంది బ్రీతింగ్ అపరాటస్ (BA Sets) ధరించి రక్షణలో పాల్గొన్నారు.
పాతబస్తీ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇక ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ALSO READ | హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు మూసివేత
గౌతమ్ నగర్ కు వెళ్లిన మీడియా పైన పోలీసుల పైన మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల వివరాలు నోట్ చేస్తుండగా ఆగ్రహంతో సీఐపై దాడి చేశారు మృతుల బంధువులు. మీడియాను కూడా అనుమతించలేదు.
మైలార్ దేవ్పల్లిలో మూడంతస్తు భవనంలో మంటలు
మైలార్ దేవ్పల్లిలో మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటల చెలరేగాయి.పెద్దఎత్తున మంటలు ఎగిపపడ్డాయి.మెట్ల దగ్గరే మంటలు చెలరేగడంతో కిందికి దిగే మార్గం లేక భవనంలోని నివాసితులు టెర్రస్ పైకి ఎక్కి సాయం కోసం హాహాకారాలు చేశారు. ప్రమాద సమయంలో దాదాపు50 మంది భవనంలో ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మూడు ఫైరింజన్లతో మంటలార్పారు. లాడర్స్ ద్వారా టెర్రస్ పై ఉన్న వారిని కిందికి దించడం పెద్దప్రమాదం తప్పింది.
చర్లపల్లిలో ఐఓసీ దగ్గర అగ్నిప్రమాదం...
ఆదివారం సాయంత్రం చర్లపల్లి లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ దగ్గర పెట్రోల్ ట్యాంకర్ లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. పక్కకు నిలిపేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తుండగా..ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ట్యాంకర్ తోపాటు మరో గ్యాస్ ట్యాంకర్లకు మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో మంటలను అదుపులోకి వచ్చాయి.. ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.