బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు.. స్టార్ క్రికెటర్లు, సినీ తారల ఆస్తులు జప్తు!

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు.. స్టార్ క్రికెటర్లు, సినీ తారల ఆస్తులు జప్తు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  1xBet బెట్టింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)  మరింత దూకుడు పెంచింది.  ఈ అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై కొరడా ఝుళిపిస్తూ.. తాజాగా రూ. 18.10 కోట్ల విలువైన చరాస్తి, స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు సీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ. 37.23 కోట్లకు చేరింది.

1xBet ముసుగులో భారీ కుంభకోణం

విదేశీ గడ్డపై ఉంటూ భారత్‌లో అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న 1xBet , దాని అనుబంధ సంస్థలైన 1xBat, 1xBat Sporting Linesలపై ఈడీ లోతైన దర్యాప్తు చేస్తోంది. విదేశీ సర్వర్ల ద్వారా నడుస్తున్న ఈ సైట్లు భారత్‌లో అధికారిక అనుమతులు లేకుండానే బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయని తేలింది. సినీ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ బెట్టింగ్ కేసులో ఉండటంతో మరింత  కలకలం రేపుతోంది. 

ED దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు..

ప్రజల నుంచి డబ్బు వసూలు చేయడానికి డైనమిక్ యూపీఐ (UPI) ఐడీలను వాడారు. ఇవి 'మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్'కు లింక్ అయి ఉన్నాయని ఈడీ గుర్తించింది..అధిక ట్రాఫిక్ ఉండే 'CREX', 'OneCricket' వంటి క్రికెట్ యాప్‌ల ద్వారా ఈ అక్రమ బెట్టింగ్‌ను ప్రచారం చేసినట్లు ఈడీ ఒక నిర్థారణకు వచ్చింది.. ఇందుకోసం స్విట్జర్లాండ్‌కు చెందిన Bwise Media AG అనే సంస్థతో ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.

చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు, సినీ తారలు

ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన,వివాదాస్పదమైన విషయం ఏమిటంటే.. పాపులర్ క్రికెటర్లు, సినీ తారలు కూడా ఈ అక్రమ నిధులతో సంబంధం కలిగి ఉన్నట్లు ఈడీ ఆరోపించింది. గత ఏడాది కాలంగా జరిగిన విచారణలో భాగంగా పలువురు ప్రముఖుల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పల ఆస్తులను రూ. 7.93 కోట్ల కేసులో భాగంగా జప్తు చేయగా.. అంతకుముందు శిఖర్ ధావన్, సురేష్ రైనాలకు చెందిన రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను కూడా సీజ్ చేశారు. 

►ALSO READ | టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. నటుడు శివాజీ రాజా తండ్రి మృతి

నటి ఊర్వశి రౌతేలా, సామాజిక సేవకుడిగా పేరొందిన నటుడు సోనూ సూద్, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, అంకుష్ హజ్రా, నేహా శర్మ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. ఈ సెలబ్రిటీలు ఆయా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయడం కోసం విదేశీ సంస్థల నుండి భారీగా పారితోషికాలు తీసుకున్నారు. ఈ నిధులు అక్రమ మార్గాల్లో వచ్చాయని తెలిసి కూడా వారు ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

డిజిటల్ బెట్టింగ్ వెనుక చీకటి దందా

1xBet వంటి ప్లాట్‌ఫారమ్‌లు తమ ప్రకటనలను నేరుగా ఇవ్వకుండా, 'సర్రోగేట్ అడ్వర్టైజింగ్'  పద్ధతిని పాటిస్తాయి. అంటే ఒక వార్తా ఛానల్ పేరుతోనో లేక స్పోర్ట్స్ యాక్సెసరీస్ పేరుతోనో బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేస్తాయి. పార్థ్‌టెక్ డెవలపర్స్ (Parthtech Developers) రన్ చేసే 'Parth Adex' సర్వర్ ద్వారా ఈ ప్రకటనలను జియో-టార్గెట్ చేస్తూ భారతీయులను ఆకర్షించేలా ప్లాన్ చేశారు. ఇది మనీ లాండరింగ్ చట్టం (PMLA) సెక్షన్ 50 కింద తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని ఈడీ తెలిపింది.

యువత అప్రమత్తంగా ఉండాలి!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు కేవలం మీ జేబులు మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తాయి. తాము ప్రచారం చేస్తున్న సంస్థల వెనుక ఉన్న నిధుల మూలాలను తనిఖీ చేయకుండా సెలబ్రిటీలు ఒప్పందాలు చేసుకుంటే  చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈడీ హెచ్చరించింది. యువత ఇలాంటి ఈజీ మనీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సెలబ్రిటీల ప్రచారాన్ని చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు.