
హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఘటనా స్థలంలో ముగ్గురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 17 కు చేరుకుంది. ప్రమాద సమయంలో భవనలో 30 మంది ఉండగా.. 17 మంది చనిపోయారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఆదివారం (మే18) తెల్లవారు జామున గుల్జార్ కృష్నా పెరల్స్ & మోడీ పెరల్స్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెసర్ పేలటంతో భారీ శబ్దాలతో మంటలు వ్యాపించాయి. ప్రమాదం రాత్రి పూట జరగటంతో గుర్తించే సరికి పొగ కమ్మేసింది. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ప్రమాద స్థలంలోనే ముగ్గురు చనిపోయారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది క్షతగాత్రులను కాపాడీ బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో నివసిస్తున్న వారు స్పృహ కోల్పోయినట్లు అగ్గిమాపక సిబ్బంది గుర్తించింది. క్షతగాత్రులను ఉస్మానియా, మలక్పేట్ యశోద, హైదర్ గూడ, డీఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు వెల్లడించారు అధికారులు. రాజేందర్ కుమార్, సుమిత్ర (65), అభిషేక్ మోడీ(30), ఆరుషి జైన్, మున్నీ బాయి, ఇరాజ్, హర్షాలీ గుప్త, షీతల్ జైన్ అనే ఎనిమిది మంది మొదట ఈ ఘటనలో చనిపోయినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 9 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో ముగ్గురు చనిపోగా.. చికిత్స పొందుతూ 17 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు.
మంటలు ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కు వ్యాపించటంతో.. చార్మినార్ వెళ్లే రహదారులను మూసివేశారు పోలీసులు. ఏసీ కంప్రెసర్ పేలడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందినిపోలీసులు తెలిపారు.
బాధితులకు అండగా ఉంటాం: సీఎం రేవంత్
మీర్ చౌక్ అగ్ని ప్రమాదంపై సీఎం ఆరా తీశారు. ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ఈ ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు, బాధితులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
కేంద్రంతో మాట్లాడి ఆర్థిక సహాయం చేస్తాం: కిషన్ రెడ్డి
మీర్ చౌక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంతో మాట్లాడి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది జాప్యం కారణంగా మృతుల సంఖ్య పెరగిందని ఆయన విమర్శించారు.
ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదు: మంత్రి పొన్నం
సీఎం ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రాలతో ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించలేమని, రాజకీయాలు తగవని హితవు పలికారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టిందని, ఎలాంటి జాప్యం జరగలేదని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.