
- తీవ్రంగా గాయపడినోళ్లకు 10 లక్షలు.. స్వల్పంగా గాయపడినోళ్లకు 5 లక్షలు
- పాశమైలారం ఘటనలో బాధిత ఫ్యామిలీలకు పరిహారంపై సీఎం రేవంత్ ప్రకటన
- ప్రమాదానికి ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌దే బాధ్యత
- యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పిస్తం
- విచారణకు కమిటీ.. బాధ్యులపై కఠిన చర్యలు
- చనిపోయిన కార్మికుల పిల్లలకు గురుకులాల్లో అడ్మిషన్లు ఇస్తామని వెల్లడి
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం.. ఆస్పత్రిలో బాధితులకు పరామర్శ
సంగారెడ్డి, వెలుగు:పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో చనిపోయినోళ్ల, గాయపడినోళ్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘‘పరిహారం విషయంలో ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాను. మంత్రులు పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటారు.
చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడినోళ్లకు రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడినోళ్లకు రూ.5 లక్షలు ఫ్యాక్టరీ యాజమాన్యమే చెల్లించాలని ఆదేశించాను” అని తెలిపారు. మంగళవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహతో కలిసి ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పటాన్‌చెరులోని ధృవ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న 9 మంది కార్మికులను పరామర్శించారు.
ఈ ఘటనపై ఫ్యాక్టరీలోనే రివ్యూ నిర్వహించారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘‘ఘటన జరిగిన రోజు నుంచి మంత్రులు వివేక్, దామోదర నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వాళ్ల పర్యవేక్షణలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. కార్మికుల్లో బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినోళ్లు ఉన్నారు. కార్మికుల మృతదేహాలను ప్రభుత్వమే వాళ్ల సొంతూళ్లకు పంపిస్తుంది. మృతి చెందిన కార్మికుల పిల్లలకు గురుకులాల్లో అడ్మిషన్లు కల్పిస్తాం” అని వెల్లడించారు.
ఇంకా కొంతమంది ఆచూకీ తెలియలేదు..
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా పరిశ్రమ యాజమాన్యం రాకపోవడం బాధాకరమని అన్నారు. ‘‘ఈ ప్రమాదంలో దాదాపు 36 మంది చనిపోయినట్టు సమాచారం ఉంది. ఘటన జరిగిన టైమ్‌లో 143 మంది కార్మికులు ఉండగా, అందులో 58 మందిని అధికారులు గుర్తించారు. మిగతా వాళ్లంతా శిథిలాల కింద ఉన్నారా? లేక భయంతో ఎక్కడికైనా వెళ్లారా? అనేది తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై విచారించేందుకు చీఫ్ సెక్రటరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, లేబర్ డిపార్ట్‌మెంట్, అడిషనల్డీజీలతో కలిపి కమిటీ నియమించాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.
ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌పై మంత్రి శ్రీధర్‌బాబు సీరియస్..
సిగాచి ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు సీరియస్ అయ్యారు. సీఎం సమీక్షకు ఫ్యాక్టరీ ప్రతినిధి మాత్రమే హాజరయ్యారు. ప్రమాదం జరిగి 24 గంటలైనా ఫ్యాక్టరీ యాజమాన్యం రాకపోవడం దారుణమని మంత్రి మండిపడ్డారు. ‘‘ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిన్నటి నుంచి ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా ఫ్యాక్టరీ ఓనర్ ఎందుకు రాలేదు. ఇంతమంది చనిపోతే ఇలాగేనా స్పందించేది?” అని కంపెనీ ప్రతినిధిపై ఫైర్ అయ్యారు.ఈ ఘటనపై వెంటనే యాజమాన్య వైఖరి చెప్పాలని ఆదేశించారు.
ఫ్యాక్టరీదే బాధ్యత..
ఈ ప్రమాదానికి సిగాచి కంపెనీ మేనేజ్‌మెంట్‌దే పూర్తి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పరిశ్రమలో ఇంతకుముందు ఏమైనా ప్రమాదాలు జరిగాయా? ఇందులో తనిఖీలు చేపట్టారా? అని అధికారులను ప్రశ్నించారు.
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. నిపుణులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. సిగాచి ఫ్యాక్టరీకి అనుమతులు ఉన్నాయా? భద్రత చర్యలు తీసుకున్నారా? కార్మికులకు ప్రమాద బీమా ఉందా? అని అడిగి తెలుసుకున్నారు.