వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన..

వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన..

తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరంగల్ జిల్లాను ముంచెత్తాయి. ఈ క్రమంలో శుక్రవారం ( అక్టోబర్ 31 ) వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. హన్మకొండ జిల్లా సమ్మయ్య నగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం రేవంత్. సీఎం తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ సమ్మయ్య నగర్, పోతన నగర్, రంగంపేటలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటను పరిశీలించారు సీఎం రేవంత్. ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించిన సీఎం రేవంత్ నయూమ్ నగర్ బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్.

ఇదిలా ఉండగా.. మొంథా తుఫాన్‍ ధాటికి ఓరుగల్లు ఆగమైంది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కుండపోత వాన, ఈదురుగాలులకు జనం వణికిపోయారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత తుఫాన్‍ ఆగి.. గురువారం ఉదయం ఎండకొట్టినా వందలాది కాలనీలు, ఇండ్లన్నీ వరద నీటిలోనే చిక్కుకున్నాయి. 

వరంగల్‍, హనుమకొండ నగరాలకు ఎగువ భాగంలో ఉండే గొలుసు కట్టు చెరువులు ఒక్కొక్కటిగా పొంగుతూ అన్నీ ఒకటిగా కలిసివచ్చి సిటీ మీద పడటంతో గురువారం ఉదయం 11 వరకు గంటగంటకు వరద పెరిగింది. దీని ఎఫెక్ట్ హనుమకొండలోని కేయూ 100 ఫీట్ల రోడ్‍ కాలనీలపై పడింది. ఎన్డీఆర్‍ఎఫ్‍, ఎస్డీఆర్​ఎఫ్​ బలగాలు సహాయ చర్యల కోసం పడవలతో సిద్ధంగా ఉన్నా.. వరద ఉధృతికి వారు అనుకున్న గమ్యస్థానాలకు చేరుకోవడం సాధ్యపడలేదు.