రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

రైతు భరోసాపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో  రైతు భరోసా గుట్టలు,  చెట్లు, లేవుట్లకు ఇవ్వడం కుదరదని చెప్పారు. ఇప్పటివరకు ఐదేకరాల లోపు ఉన్న దాదాపు  62 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామన్నారు.  రైతు భరోసా అందని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రైతు భరోసా లబ్ధిదారులకు అందేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.  రాష్ట్రంలో  కాంగ్రెస్ వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా  ఆదివారం మీట్‌ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.  

తాము అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ప్రజాపాలన అందించామని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలు స్వేచ్ఛ కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. గతంలో అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన చేశారని, ప్రజలు నిరసనలు చేయకుండా అడ్డుకున్నారని సీఎం దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని సీఎం అన్నారు. 

ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. 8 లక్షల కుటుంబాలు రూ.500 సిలిండర్ అందుకున్నాయి. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కేసీఆర్ నాశనం చేశారు. వాహన రిజిస్ట్రేషన్‌లో టీఆర్ఎస్‌కు నకలుగానే టీఎస్ తీసుకొచ్చారు’ అని ఆరోపించారు.