బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్.తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి:: సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్.తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి:: సీఎం రేవంత్ రెడ్డి
  • తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి: సీఎం రేవంత్​రెడ్డి
  • జూబ్లీహిల్స్​లో ఓట్లు చీల్చేందుకు బీజేపీ, బీఆర్​ఎస్​ ప్లాన్​
  • గత పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఆ పార్టీలు ఇట్లనే చేసినయ్​
  • రాజీవ్​గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజా పాలన 
  • 21 ఏండ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే చాన్స్​.. 
  • అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటన 
  • రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో ప్రసంగం
  • సల్మాన్​ ఖుర్షీద్​కు సద్భావన అవార్డు అందజేత

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో బీజేపీకి బీఆర్​ఎస్​ పార్టీ బీ టీమ్​గా మారిందని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్​పై కుట్రలు చేస్తున్నాయని.. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలోనూ అదే ప్లాన్​తో ముందుకు వెళ్లాలనుకుంటున్నాయని ఆయన దుయ్యబట్టారు. ‘‘జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికతోపాటు ఆ తర్వాత ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని బీజేపీ, బీఆర్​ఎస్​ కలిసి ప్లాన్​ చేస్తున్నాయి. ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి” అని సూచించారు. ఆదివారం చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటం వద్ద సీఎం, మంత్రులు నివాళులర్పించారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత సల్మాన్​ ఖుర్షీద్​కు సద్భావన అవార్డు  అందజేశారు. అనంతరం సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. బీఆర్​ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని.. ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్​ పార్టీపై కుట్రలు పన్నుతున్నాయన్నారు. ‘‘గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్​ఎస్ మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో 21 శాతం బీఆర్​ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి? ఆలోచించండి. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో ఓట్లు చీల్చాలని బీఆర్​ఎస్​, బీజేపీ చూస్తున్నాయి” అని పేర్కొన్నారు. రాజీవ్​ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ఆయన తెలిపారు. 

గాంధీ.. భారతదేశానికి పర్యాయపదం

రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర  35 ఏండ్లుగా జరుగుతున్నదని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.  దేశానికి గాంధీ పర్యాయపదం అని పేర్కొన్నారు.  ‘‘దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ.. సద్భావన యాత్ర చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం.. రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్ కు  అందించిన నిర్వాహకులను అభినందిస్తున్న’’ అని తెలిపారు.

‘‘గాంధీ అనే పదం భారతదేశానికి పర్యాయ పదం. గాంధీ కుటుంబం దేశానికి స్ఫూర్తినిచ్చింది. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారు.  ఇందిరమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు. దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిది. గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ అనుబంధం ఈనాటిది కాదు..  మూడుతరాలుగా వారి కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పనిచేస్తున్నది. సల్మాన్ ఖుర్షీద్ రాజీవ్ సద్భావన అవార్డు అందించడం మనందరికీ గర్వకారణం” అని సీఎం రేవంత్‌ తెలిపారు. 

21 ఏండ్లకే ఎమ్మెల్యే.. అసెంబ్లీలో తీర్మానం చేస్తం

18 ఏండ్లకే ఓటు హక్కును కల్పించి దేశాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్​రెడ్డి కొనియాడారు. ‘‘21 ఏండ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేల అర్హత వయసు 21 ఏండ్లకు కుదించాలి.. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తం” అని వెల్లడించారు. రాజీవ్ స్ఫూర్తి తో రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేశారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ స్పూర్తితోనే కులగణన చేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. 

పేదల సంక్షేమమే ధ్యేయంగా 
ప్రజాపాలన: పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్​​

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన కొనసాగుతున్నదని పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయన్నారు. 1990 అక్టోబర్ 9న దేశ ఐక్యత కోసం చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు సద్భావన యాత్ర చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ఈ యాత్రను పురస్కరించుకుని ఏటా సద్భావన అవార్డు కూడా అందజేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది  సల్మాన్ ఖుర్షీద్ కు అవార్డు ఇవ్వడం శుభ పరిణామమని పేర్కొన్నారు. మచ్చలేని వ్యక్తి, మార్గదర్శి సల్మాన్ ఖుర్షీద్ అని ఆయన కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆలోచనల అమలు కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని తెలిపారు. పదేండ్లుగా ఎన్నడూ లేని విధంగా ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమం నడుస్తున్నదని పేర్కొన్నారు. బిహార్​లో పది కిలోల దొడ్డు బియ్యం తప్ప మరే సంక్షేమం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహేశ్​ కుమార్​ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.