- పదేండ్లలో రాష్ట్రాన్ని నడిబజారులో నిలబెట్టి.. దివాలా తీయించిండు: సీఎం రేవంత్
- మేం ఒక్కొక్కటి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నం
- కృష్ణా, గోదావరి బేసిన్లపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం.. రండి
- ప్రజలు తీర్పు ఇచ్చినా కరుడుగట్టిన నేరగాళ్లకు కనువిప్పు కలగడం లేదు
- 811 టీఎంసీల్లో 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు?
- రెండేండ్లలోనే పాలమూరు ప్రాజెక్టులకు రూ.6,500 కోట్లు ఖర్చు చేశాం
- కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను
- ఆయన ఆసుపత్రిలో ఉంటే వెళ్లి పరామర్శించి వచ్చానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని.. ఆయనొక ఆర్థిక ఉగ్రవాది అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిబజారులో నిలబెట్టి దివాలా తీయించిండు. భూకంపం వచ్చి వెళ్లాక మిగిలిన శిథిలాల మాదిరిగా రాష్ట్రాన్ని మార్చితే.. మేం ఇప్పుడు ఆ శిథిలాలను తొలగిస్తూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం” అని ఆయన తెలిపారు. తట్టెడు మట్టి తీయలేదని కేసీఆర్ అంటున్నారని.. ఈ రెండేండ్లలోనే పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.6,500 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ‘‘జలద్రోహి వస్తే.. వాస్తవమేమిటో చూపిస్తా” అంటూ కేసీఆర్‌కు సవాల్ చేశారు. నాడు ఒక్క సంతకంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు.
‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కలుగులో ఉన్న ఎలుకకు పొగపెడితే బయటకు వచ్చినట్లు కేసీఆర్ బయటకు వచ్చిండు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయనకు తత్వం బోధపడి సత్ప్రవర్తనతో ఉంటారని ఆశించా. కానీ ఆయన బుద్ధి మారలేదు. 76 నిమిషాల పాటు అవే అబద్ధాలను మళ్లీ మళ్లీ చెప్పిండు” అని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో, ఇప్పుడు జూబ్లీహిల్స్, పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పదేండ్ల నేరాలను, ఘోరాలను దృష్టిలో పెట్టుకొనే ప్రజలు తీర్పునిచ్చారని తెలిపారు.‘‘అయినా ఆ కరుడుగట్టిన నేరగాళ్లకు కనువిప్పు కలగడం లేదు. జంకు లేకుండా ఇష్టమున్నట్లు అబద్ధాలు వల్లెవేస్తున్నరు. పదేండ్లలో 8 లక్షల కోట్ల పైన అప్పులు చేసిన్రు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన్రు. మేం వచ్చినంక సెట్ చేస్తున్నాం. 11.50 శాతం అధిక వడ్డీ ఉన్న రూ.26 వేల కోట్ల అప్పులు రీస్ట్రక్చర్ చేయించినం. 12 ఏండ్ల టెన్యూర్‌ను 35 ఏండ్లకు పెంచినం. దీంతో ఏటా రూ.4 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగులుతున్నాయి. ఇంకో రూ. 85 వేల కోట్ల అప్పులు రీస్ట్రక్చర్ చేయాలని మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరి వచ్చిన. పాలమూరుపై సుప్రీంకోర్టులో కొట్లాడి.. ఇప్పుడు ట్రిబ్యునల్71 శాతం వాటా కోసం మంత్రి ఉత్తమ్ నేరుగా అటెండ్ అయి హియరింగ్స్ వింటున్నరు” అని ఆయన వివరించారు.
తెలంగాణ గొంతు కోసిన జలద్రోహి
‘‘పాలమూరు జిల్లా కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఏపీ జలదోపిడీ ఎక్కువగా జరిగింది. 2004 నుంచి -2014 మధ్య, ఆ తర్వాత 2014 నుంచి -2024 వరకు కృష్ణా జలాలను ఏపీ ఎంత తరలించుకుపోయిందో లెక్కలు తీద్దాం రండి” అని కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘పదే పదే సంతకాలు పెట్టడం ఎందుకని, 2021-–22లో కేసీఆర్ శాశ్వతంగా సంత కం పెట్టి తెలంగాణ హక్కులను రాసిచ్చేశారు. కృష్ణాలో ఉన్న 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టి మన రాష్ట్రానికి మరణశాసనం రాసింది కేసీఆరే. ఇది మొదటి ద్రోహం. జూరాల ప్రాజెక్టు నుంచి అంటే.. తల దగ్గర ఒడిసిపట్టుకోవాల్సిన నీళ్లను తోక దగ్గరికి (శ్రీశైలానికి) తరలించడం ద్వారా ఏపీ దోపిడీకి కేసీఆర్ రాజమార్గం వేసిండు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ముచ్చుమర్రిని ఏపీ కట్టుకునేలా చేసిందే కేసీఆర్. కృష్ణా నదిపై పదేండ్లలో ఒక్క ప్రాజెక్టునూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు. భీమా, నెట్టెంపాడు, మక్తల్, కొడంగల్, దిండి, ఎస్ఎల్బీసీ ఏదీ పూర్తి కాలేదు. ఇది రెండో ద్రోహం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్తుల కోసం అల్లుడు.. కుర్చీ కోసం కొడుకు!
‘‘కేసీఆర్ బయటకు వస్తే స్వాగతిస్తాం. కానీ ఆయన రాక అకాల వడగండ్ల వానలా ఉంది. కొడుకు, అల్లుడు కొట్లాడుకుంటున్నారని.. కేటీఆర్ ‘చెల్లని నోటు’ (ఐరన్ లెగ్) అవుతున్నాడని, పార్టీ పగ్గాలు హరీశ్ రావుకు అప్పగించాలనే వాదన వస్తున్నదని, ఇలాంటి పరిణామాలను ఆపేందుకే కేసీఆర్ బయటకు వచ్చారు. హరీశ్ రావు పార్టీని హస్తగతం చేసుకుంటే రూ.5 వేల కోట్ల పార్టీ ఆస్తులు దక్కుతాయని చూస్తున్నడు. కేటీఆర్ తండ్రి కుర్చీ కోరుకుంటుంటే.. హరీశ్ రావు ఆయన చావు కోరుకుంటున్నడు. కేసీఆర్ పోయిన తర్వాత ‘నా దారి నాదే’ అని హరీశ్ రావు చెప్పకనే చెప్పిండు. అసెంబ్లీకి కేసీఆర్‌ను రానివ్వకుండా అడ్డుకుంటున్నది కొడుకు, అల్లుడే. ఆయన ఉండొద్దని వాళ్లే కోరుకుంటున్నరు. ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలని వాళ్లే అనుకుంటున్నరు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి రావాలని మేం కోరుకుంటున్నం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఈరోజు కేసీఆర్ మాట్లాడిన భాష ఆయన వయసుకు తగినది కాదు. ఆయన విసనకర్రతో ఇట్లంటే.. నేను ఈలపీటతో అట్లంట. అయినా కేసీఆర్ చావును నేనెందుకు కోరుకుంటా? ఆయన ఆస్పత్రిలో ఉంటే వెళ్లి పరామర్శించి వచ్చా. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు కదలకుండా కేసులు వేసింది హర్షవర్ధన్ రెడ్డి. తర్వాత 'సొక్కమైనాయన' అంటూ ఆయనకే టికెట్ ఇచ్చి ఓట్లు వేయాలని ప్రజలను అడిగింది ఎవరు? పదేండ్లలో సిటీకి ఏం చేసిండు?” అని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల మీద కావాలంటే నిజనిర్ధారణ కమిటీ వేసుకొని లెక్కలు చెక్ చేసుకోవాలని సూచించారు.
ప్రధాని మోదీ ఎరువు పంపించగానే ఇప్పుడు కేసీఆర్ కోలుకొని బయటకు వచ్చిండు. కాళేశ్వరంపై విచారణకు సీబీఐకి అనుమతి ఎందుకు రావడం లేదో చెప్పాలి? అరవింద్ కుమార్ విచారణకు డీవోపీటీ నుంచి ఎందుకు పర్మిషన్ రావడం లేదో సమాధానం ఇవ్వాలి? జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కలుగులోని ఎలుక లెక్క కేసీఆర్ బయటకొచ్చి.. 76 నిమిషాల పాటు అవే అబద్ధాలను మళ్లీ మళ్లీ చెప్పిండు. కృష్ణాలోని 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టి మన రాష్ట్రానికి మరణశాసనం రాసిన జలద్రోహి ఆయన. పదేండ్లు తండ్రీకొడుకులు (కేసీఆర్, కేటీఆర్) రాష్ట్రంపై ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డరు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన్రు. ఇప్పుడు కేటీఆర్ ‘ఐరన్ లెగ్’ అవుతున్నడని, పార్టీ పగ్గాలు హరీశ్‌కు అప్పగించాలనే డిమాండ్ వస్తున్నదని తెలిసి.. ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ నోటికొచ్చింది మాట్లాడుతున్నడు.
- సీఎం రేవంత్‌రెడ్డి
డీపీఆర్ వాపస్ వచ్చిందే బీఆర్ఎస్ టైమ్‌లో..!
తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం ఎవరూ చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘పట్టిసీమ బాగా కట్టారని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అభినందించిందే కేసీఆర్. అటు రాయలసీమకు, ఇటు కోస్తాంధ్ర శ్రీకాకుళానికి నీళ్లు తీసుకుపొమ్మని చెప్పిందే ఆయన. మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లా రైతులకు మరణశాసనం రాసి, వలసలకు కారణమైంది కేసీఆరే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వాపస్ వచ్చిందని అంటున్నారు.. వాళ్లు(బీఆర్ఎస్ హయాంలో) సరిగ్గా చేసి పంపకపోతే అప్పుడే (2023లో) వెనక్కి వచ్చింది. కృష్ణాలో 299 టీఎంసీలు చాలు అని చెప్పి, ఆ తర్వాత ట్రిబ్యునల్ లో 50:50 అని అడిగింది కూడా వాళ్లే. ఇదంతా నాడు చంద్రబాబు, జగన్‌కు, కేసీఆర్ కు మధ్య ఒక కాంట్రాక్టర్ ద్వారా జరిగిన వ్యవహారం. ముందు దానికి సమాధానం చెప్పి, తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చి క్షమించాలని వేడుకోవాలి” అని కేసీఆర్‌కు సీఎం సూచించారు. ‘‘ఇప్పుడు మాట్లాడుతున్న 90 టీఎంసీలు అడిగింది కేసీఆరే.. మేం అడిగింది లేదు. 45 టీఎంసీలు ట్రిబ్యునల్ డిసైడ్ చేస్తుంది” అని తెలిపారు. పదేండ్లలో లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే పనిచేశారని.. ఇరిగేషన్ కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే, అందులో రూ.1.80 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘‘వాళ్లు వేల కోట్లు ఖర్చు పెట్టినా సగం ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష చూపించారు.. పదేండ్లలోనూ అదే జరిగింది. కేసీఆర్ సంగంబండకు రూ.12 కోట్లు ఇవ్వకపోతే నేను వచ్చాక ఇచ్చి పూర్తి చేశా. కల్వకుర్తి భూసేకరణ పూర్తి చేశా. తట్టెడు మట్టి ఎత్తలేదని కేసీఆర్ అంటున్నడు.. పాలమూరులో వివిధ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.6500 కోట్లు ఖర్చు చేశాం.. రా జలద్రోహి చూపిస్త” అని సవాల్ చేశారు. సొంత బిడ్డ కవితను పార్టీ నుంచి బయటపడేసింది కేసీఆర్ కుటుంబమేనని, అవి వాళ్ల కుటుంబ వ్యవహారాలని, వాటి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం.. రండి
‘‘కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కోరుకుం టున్నా. జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చ చేద్దాం. ఒకరోజు కృష్ణా నది ప్రాజెక్టుల మీద, ఒకరోజు గోదావరి బేసిన్ మీద చర్చిద్దాం. సరి పోదంటే రెండేసి రోజులు అర్థవంతమైన చర్చలు చేద్దాం. ఉమ్మడి ఏపీలో ఏం జరిగింది? పదేం డ్లలో ఏం చేశారు? రెండేండ్లలో మేం ఏం చేశా మో చర్చిద్దాం. భవిష్యత్ ప్రణాళికలపై సూచనలు ఇవ్వండి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మౌనముద్ర వీడాలి. రోడ్ల మీద కాదు చట్టసభల్లో ప్రజలకు చెబుదాం. అంతేగానీ.. అసెంబ్లీకి చెంచాలను పంపి మాట్లాడిస్తాం అంటే ఎట్లా? చెంచాలకేం తెలుసు? ఒకవేళ రానంటే.. జయలలిత, ఎన్టీఆ ర్ లెక్క అనుకుంటే అదే విషయం బయటకు ప్రకటించండి’’ అని సీఎం రేవంత్ తేల్చిచెప్పారు.
