తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపును పరిశీలించండి.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌ రెడ్డి లేఖ

తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపును పరిశీలించండి.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌ రెడ్డి లేఖ
  • బ్యారేజీ ఎత్తు 148 మీటర్లకన్నా ఎక్కువున్నా 
       
  • మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే
  • ఎఫ్​ఆర్​ఎల్​ పెరిగితే తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీరు తెచ్చుకునే అవకాశం
  • ఈ అంశాలపై  చర్చించేందుకు వచ్చే తెలంగాణ ప్రతినిధి బృందానికి టైం ఇవ్వండి 
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌‌ నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చల దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు సీఎం  రేవంత్‌‌ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌కు బుధవారం లేఖ రాశారు. బ్యారేజీ ఎత్తు148 మీటర్ల కన్నా ఎక్కువున్నా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే ఉంటుందని, ఎఫ్ఆర్​ఎల్​పెరిగితే తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీరు తెచ్చుకునే అవకాశం ఉందని లేఖలో సీఎం వివరించారు. 
ఈ అంశంపై చర్చకు త్వరలో మహారాష్ట్ర రానున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని,  అనుకూలమైన తేదీని ఖరారు చేయాలని సీఎం విజ్ఞప్తిచేశారు.  కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్​ సర్కారు పక్కనపెట్టిన అంబేద్కర్​ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
 
 మొదటి ప్రతిపాదనలో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని అప్పటి కాంగ్రెస్​ సర్కారు నిర్ణయించింది.  కానీ 2016 ఆగస్టు 23న జరిగిన ఇంటర్‌‌ స్టేట్‌‌ బోర్డు సమావేశంలో తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు అవసరమైన అనుమతులకు  సహకారం అందిస్తామని అప్పట్లో తెలిపింది. కానీ బీఆర్ఎస్​అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం కేసీఆర్​.. ప్రాణహిత చేవెళ్లకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ కుంగిపోవడం, మిగిలిన రెండు రిజర్వాయర్లలో సీపేజ్​లు రావడంతో కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది. 
 
కాగా గతంలో మహారాష్ట్ర అంగీకరించిన148 మీటర్ల ఎత్తుతో రిజర్వాయర్​ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవన్న నిపుణుల సూచనలతో మహారాష్ట్రను కనీసం 150 మీటర్ల ఎత్తుకు ఒప్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్​రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్​కు లేఖ రాశారు. ఆదిలాబాద్‌‌, నిజామాబాద్‌‌, కరీంనగర్‌‌, మెదక్‌‌ జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్‌‌ఆర్‌‌ఎల్‌‌  పరిశీలించినా,  మహారాష్ట్రలో  ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని సీఎం వివరించారు. ఎఫ్‌‌ఆర్‌‌ఎల్‌‌ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుందని పేర్కొన్నారు.