కేంద్రం బిల్లులు ఆమోదిస్తే.. సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు: CM రేవంత్

కేంద్రం బిల్లులు ఆమోదిస్తే.. సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు: CM రేవంత్

న్యూఢిల్లీ: తెలంగాణలో పక్కాగా కులగణన చేశామని.. కులగణనలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందేళ్లుగా వాయిదా పడ్డ కుల గణనను నెల రోజుల్లో పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం (జూలై 23) కాంగ్రెస్ ఎంపీలతో కలిసి అక్కడ మీడియాతో మాట్లాడారు. 

విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని.. కానీ ఆ బిల్లులను ఆమోదించడంలో కేంద్రం ఆలస్యం చేస్తోందని విమర్శించారు. కేంద్రం బిల్లులకు త్వరగా ఆమోదం తెలిపితే.. సెప్టెంబర్ లోపు తెలంగాణలో స్థానిక  సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 

2025, సెప్టెంబర్ 30లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని.. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఇందుకు గురువారం (జూలై 24) మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి.. కుల గణనలోని అంశాలను ఉభయ సభల్లోని కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తామని చెప్పారు. 

ప్రస్తుతం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరుగుతున్నాయని.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే మంచి సమయమన్నారు. 2025, సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.