మహబూబాబాద్​లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి

మహబూబాబాద్​లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు

మహబూబాబాద్​, వెలుగు: జిల్లాకేంద్రంలో  నేడు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే  భారీ బహిరంగ సభను  విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్​చార్జి  తుమ్మల నాగేశ్వరరావు  కోరారు. గురువారం సాయంత్రం  జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం  హాజరయ్యే సభ ఏర్పాట్లను మంత్రి  పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని  పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.  19న మధ్యాహ్నం 2గంటల్లోగా  జిల్లా కేంద్రానికి  కార్యకర్తలు చేరుకోవాలన్నారు. కాంగ్రెస్   మహబూబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ వేసిన తరువాత  జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఆయా మండలాలకు చెందిన  కాంగ్రెస్​ నాయకులు వేసవిలో కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా సభకు ప్రజలను  తరలించే ఏర్పాట్లను కొనసాగించాలని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, డిసిసి అధ్యక్షుడు భరత్ చందర్​ రెడ్డి, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్ ను టచ్ చేసే శక్తి ఏ పార్టీకి లేదు 

మరిపెడ : మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి లక్ష మందితో కలిసి వెళ్లి నామినేషన్ వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, మాజీ మంత్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం రేవంత్ సభను సక్సెస్ చేయాలని చెప్పారు.

రాహుల్ గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ,రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.    కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓర్వలేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని,కాంగ్రెస్ పార్టీని టచ్ చేసే ధైర్యం ఏ శక్తికి లేదని అన్నారు.  భారీ మెజార్టీతో బలరాం నాయక్​ ను  గెలిపించాలని పిలుపునిచ్చారు. డోర్నకల్ నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ వచ్చాడని, భవిష్యత్తులో నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. 

అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముఖ్య లీడర్లు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, విసారపు శ్రీపాల్ రెడ్డి, కొంపెల్లి సురేందర్ రెడ్డి, మరో 500 మంది కార్యకర్తలను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ నూకల నరేశ్​రెడ్డి,యుగంధర్ రెడ్డి,మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ తాజుద్దీన్,అభినవ్ రెడ్డి, రవి నాయక్,అంబరీష,ఐలమల్లు,రాజశేఖర్, ఇతర మండలాల నాయకులు పాల్గొన్నారు.