ఆ మూడు సీట్లపై అదే సస్పెన్స్

ఆ మూడు సీట్లపై అదే సస్పెన్స్
  • కాంగ్రెస్​లో తేలని ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులు
  • ఢిల్లీలో పార్టీ పెద్దలను  కలవకుండానే తిరిగొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
  • ఖమ్మం అభ్యర్థి ఎంపిక తర్వాతే మిగతా రెండింటిపై క్లారిటీ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. గురువారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ పార్టీ పెద్దలు ఎవరినీ కలవకుండానే తన పర్యటన ముగించారు. ఓ నేషనల్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రేవంత్.. తిరిగి నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరిగింది. మరోవైపు వచ్చే నెలలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల షెడ్యూల్ పై కూడా చర్చిస్తారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ పార్టీ పెద్దలెవరిని కలవకుండానే రేవంత్ పర్యటన ముగిసింది. దీంతో మూడు సీట్లపై ఉత్కంఠ కొనసాగుతున్నది.

హాట్ సీటుగా ఖమ్మం.. 

రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా, అందులో 14 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఖమ్మం సెగ్మెంట్ కాంగ్రెస్ లో హాట్ సీటుగా మారింది. ఇక్కడి నుంచి పోటీకి పార్టీ కీలక నేతల కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తుండడంతో..  అభ్యర్థి ఎంపిక హైకమాండ్ కు సవాల్ గా మారింది. ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాదరెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కొడుకు యుగేంధర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కొడుకు రఘురామరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి, ఒకప్పుడు టీడీపీలో సీనియర్ నేత అయిన మండవ వెంకటేశ్వర్ రావు పేరు కూడా తెరపైకి వచ్చింది. 

సామాజిక సమీకరణాలే కీలకం

ఖమ్మం టికెట్ ఖరారైతేనే కరీంనగర్, హైదరాబాద్ టికెట్లపై స్పష్టత రానుంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఖమ్మం టికెట్ పైనే కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థుల ఎంపిక ఆధారపడి ఉంది. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఒకవేళ ఖమ్మం టికెట్ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే కరీంనగర్ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఖమ్మం టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే, కరీంనగర్ టికెట్ వెలమ సామాజికవర్గానికి ఇచ్చే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇక హైదరాబాద్ టికెట్ ను బీసీకి ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.

రైతు కష్టాన్ని తక్కువ చేస్తే సహించం: రేవంత్ రెడ్డి ట్వీట్

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. మార్కెట్ అధికారులు.. దళారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్​చేశారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌‌‌‌లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి.. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేసిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌‌‌‌ ను రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

‘ఆప్‌‌‌‌ కి అదాలత్’ ప్రోగ్రామ్‌‌‌‌లో సీఎం రేవంత్
 

ఢిల్లీలో ఇండియా టీవీ చేపట్టిన ‘ఆప్ కి అదాలత్’ప్రోగ్రామ్‌‌‌‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 12.30కు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా యమునా అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లోని తన క్వార్టర్స్‌‌‌‌కు వెళ్లి, తర్వాత అక్కడి నుంచి ఆప్ కి అదాలత్ ప్రొగ్రామ్‌‌‌‌లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ షో దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం రేవంత్ సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్‌‌‌‌లో సామాన్య కార్యకర్త నుంచి సీఎంగా ఎదిగేందుకు ఏర్పడిన పరిస్థితులు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, ఆరు హామీల అమలు, లోక్‌‌‌‌సభ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో, కేసీఆర్ పాలనను గద్దె దించడంలో సక్సెస్ అయిన తీరును రేవంత్‌‌‌‌ వివరించారు. అనంతరం షో ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌‌‌‌కు వెళ్లారు. కాగా, రేవంత్ రెడ్డితో రికార్డు చేసిన ఈ షో అతి త్వరలో టెలికాస్ట్ కానుంది.