ప్రపంచ ఆర్థిక వేదిక అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సు 2026 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ( జనవరి 21 ) టాటా చైర్మెన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీలో విజన్–2047 లక్ష్యాలు.. పెట్టుబడులకు ఉన్న అనుకూల విధానాలను టాటా చైర్మెన్ కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ లో స్టేడియాల అభివృద్ధికి టాటా సహకారం అందించాలని కోరారు.ఈ క్రమంలో స్టేడియాల అప్‌గ్రేడేషన్‌కు టాటా చైర్మెన్ సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా మూసీ నది పునరుజ్జీవనంలో కూడా భాగస్వామ్యమయ్యేందుకు టాటా చైర్మెన్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో హోటళ్లు, రిసార్ట్స్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో కొత్త మానుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. దావోస్ లో జరిగిన జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార–వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని రేవంత్ అన్నారు. అందుకే ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రతినిధులకు సూచించారు.
