అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‎ను కలుస్తా.. ఆయన అపాయింట్మెంట్ ఇస్తరో ఇయ్యరో తెల్వదు: సీఎం రేవంత్

అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‎ను కలుస్తా.. ఆయన అపాయింట్మెంట్ ఇస్తరో ఇయ్యరో తెల్వదు: సీఎం రేవంత్

హైదరాబాద్: ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షకుడు అని.. అందుకే ఇండియా కూటమి ఆయనను ఎంపిక చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం తెలంగాణ ప్రజలకు గర్వ కారణమన్నారు. తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతిగా గెలిపించేందుకు పార్టీలకతీతంగా తెలుగు ఎంపీలు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, చంద్రబాబు, జగన్, ఒవైసీ ఒకే మాటపై నిలబడి పార్టీలకతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 

ఉప రాష్ట్రపతి విషయం ఓటింగ్ విషయంలో కేసీఆర్‎ను కలిసేందుకు సిద్ధమన్నారు. అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‎ను కలుస్తానని.. ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయనను కోరుతానన్నారు సీఎం రేవంత్. కానీ కేసీఆర్ నాకు అపాయింట్మెంట్ ఇస్తారో ఇవ్వరోనని.. ఆయన నా మొఖం చూడటానికి ఇష్టపడతారో లేదో తెల్వదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఢిల్లీ వెళ్తానని చెప్పారు. తెలంగాణ వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఇండియా కూటమికి తెలంగాణ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 

విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు, ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్‎లో ఉన్నాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులపై 90 రోజుల్లోగా క్లియర్ చేయాలని అన్నారు. కాగా, ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి కంటే ముందే ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‎ను బీజేపీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 2025, సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.