- దాడుల ఘటనలు రిపీట్ కావొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
- ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేయండి
- కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం బాధాకరమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: వీధి కుక్కల బెడద అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్ లేదంటే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ జవహర్‌నగర్‌లో వీధి కుక్కల దాడిలో రెండేండ్ల బాలుడు చనిపోవడంపై రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.
ఇప్పటి వరకు చాలా మంది చిన్నారులు వీధి కుక్కల దాడిలో చనిపోయారని తెలిపారు. పసి కందులు, చిన్నారులపై ప్రతి ఏటా కుక్కల దాడులకు వాతావరణ పరిస్థితులా..? లేక సీజనల్ కారణాలా? అనే అంశంపై స్టడీ చేసేందుకు పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. వీధి కుక్కలకు టీకాలు వేయడం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
కుక్కలు దాడులు చేస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హాస్పిటల్స్‌లో వెంటనే వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, టీకాలు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
