V6 News

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం : సీతక్క

 గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం : సీతక్క
  • సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య
  • అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా కృషి చేస్తానని వెల్లడి
  • సీతక్క ఆధ్వర్యంలో సీఎంతో గిరిజన ఎమ్మెల్యేల భేటీ 

హైదరాబాద్, వెలుగు: "ఆదివాసీ, గిరిజన బిడ్డల అభివృద్ధికి సర్కార్ అండగా ఉంటది.. ఏజెన్సీ ప్రాంతాల్లో వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్యలను పరిష్కరిస్తాం" అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, ఎడ్మ బొజ్జు, మురళీ నాయక్  జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసంలో కలిశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తాగు, సాగు నీటి అవ‌‌స‌‌రాల‌‌ను తీర్చేందుకు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి దృష్టి సారిస్తున్నామన్నారు. రోడ్ల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా పర్మిషన్ల కోసం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.   ఆదివాసీ, గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో బోర్లు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరగా,  సీఎం సానుకూలంగా స్పందించారు.  

అటవీ శాఖ అభ్యంతరాల వల్ల రహదారుల మరమ్మతులు ఆలస్యమవుతున్నాయని, కొన్నిచోట్ల కొత్త రోడ్ల పనులను అధికారులను అనుమతులు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు సీఎంకు విన్నవించారు. స్పందించిన సీఎం.. వీలైనంత త్వర‌‌గా వీటిపైన నిర్ణయం తీసుకోవాల‌‌ని అట‌‌వీ శాఖ అధికారుల‌‌ను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని కూడా పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలను మరింత బలోపేతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.