- తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి
- స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి స్టడీ చేయాలని సీఎం ఆదేశం
- మహిళా పోలీసుల పనితీరును అభినందించిన రేవంత్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా పోలీసుల పనితీరును సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. పోలీసింగ్‌లో మహిళల భాగస్వామ్యం, నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మహిళల నియామకం, శిక్షణ, కెరీర్ పురోగతిలో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సిఫారసు చేశారు. ఇతర రాష్ట్రాలు అవలంబించిన ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఇటీవల జరిగిన తెలంగాణ మహిళా పోలీసుల మొదటి సమావేశం, రాజా బహుద్దూర్ వెంకటరామి రెడ్డి (ఆర్‌బీవీఆర్ఆర్ టీజీపీఏ) వార్షిక పత్రిక – 2025ను శుక్రవారం సీఎం - విడుదల చేశారు. సెక్రటేరియెట్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిస్త్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖా గోయల్ సహా మహిళా ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసింగ్, శాంతిభద్రతలు, ఇన్వెస్టిగేషన్, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు విధుల్లో మహిళా సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.
పోలీసింగ్‌లో మహిళలను బలోపేతం చేయడానికి ఐదు ముఖ్యమైన ప్రాధాన్యతల అంశాలను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిస్త్ సీఎంకి వివరించారు. ప్రత్యేక విశ్రాంతి గదులు, బందోబస్తు సమయంలో మొబైల్ టాయిలెట్ యూనిట్లు వంటి సదుపాయాలను పెంచాలని, మహిళల పెట్రోలింగ్‌ను పెంచడానికి తగిన సంఖ్యలో స్కూటర్లను అందించాలని ఆమె కోరారు. సివిల్ పోలీస్‌లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నా లా అండ్ ఆర్డర్, బందోబస్తు విధుల్లో పెరుగుతున్న వారి బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ఆర్మ్డ్ రిజర్వ్, బెటాలియన్లలో మహిళల భాగస్వామ్యాన్ని దామాషా ప్రకారం పెంచాలన్నారు.
